Share News

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

ABN , Publish Date - Oct 04 , 2024 | 02:51 AM

కుటుంబంపై, నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..
nagarjuna

  • క్రిమినల్‌చర్య తీసుకోవాలని కోర్టులో దావా

  • సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం

  • ఇక్కడితో ముగింపు పలకండి: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ విజ్ఞప్తి

  • కేటీఆర్‌ కించపరిచేలా మాట్లాడినందువల్లే నేను అలా

  • అనాల్సి వచ్చింది.. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

  • అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను

  • నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా

  • సమంత మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు: సురేఖ

వరంగల్‌, హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తనపైన, తన కుటుంబంపైన, నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో ఒక ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. సెక్షన్‌ 222 ఆర్‌/డబ్ల్యూ, 223 బీఎన్‌ఎ్‌సఎ్‌స, 356 బీఎన్‌ఎ్‌స కింద ఆయన ఈ పిటిషన్‌ వేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరుగాంచిన తమ (అక్కినేని) కుటుంబంపై మంత్రి చేసిన అసత్య వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేశాయని ఆవేదన వెలిబుచ్చారు.


మంత్రి పదవిలో ఉండి.. నా కుటుంబాన్ని

బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి.. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన, అవాస్తవ వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి కొండా సురేఖ గురువారం వరంగల్‌లో ప్రకటించారు. ‘‘అనుకోని సందర్భంలో.. అనుకోకుండా ఓ కుటుంబంపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. కేటీఆర్‌ నన్ను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ మాటలతో వేదనకు గురై ఆయన గురించి వాఖ్యలు చేసే క్రమంలో అనుకోకుండా ఆ కుటుంబం గురించి మాట్లాడా. ఆ వాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నా. కానీ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదు’’ అని ఆమె సురేఖ స్పష్టం చేశారు.

King-Nagarjuna.jpg


పోస్టులతో బాధ

తాను వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎక్స్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆ కుటుంబం ఆవేదనతో చేసిన పోస్టులు చూసి తనకు బాధ అనిపించిందని, ఆ కుటుంబాన్ని తన వాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధ పడ్డాననని పేర్కొన్నారు. తాను పడిన బాధ వాళ్లు పడకూడదనే ఉద్దేశంతో.. తన వాఖ్యలను వెనక్కి తీసుకుంటూ తాను కూడా ఎక్స్‌లో పోస్టు చేశానని తెలిపారు. కేటీఆర్‌ తనను మరింత రెచ్చగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘కేటీఆర్‌కు నేను క్షమాపణ చెప్పడమేంటని.. ఆయనే నాకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. దొంగే ‘దొంగా దొంగా’ అన్నట్టుగా కేటీఆర్‌ ప్రవర్తన ఉందని.. ఆయన తనపై పెట్టించిన పోస్టులన్నింటినీ తొలగించాలని దుయ్యబట్టారు. తన కంటే ముందు.. మంత్రి సీతక్కపై ఇంకా ఘోరంగా ట్రోల్‌ చేశారని ఆవేదన వెలిబుచ్చారు. మహిళలను ట్రోల్‌ చెయ్యొద్దని బీఆర్‌ఎ్‌సకు హితవు పలికిన ఆమె.. ‘‘కేటీఆర్‌ నీకు మహిళలు పనికిమాలిన వాళ్లలా కనిపిస్తున్నారా? మీ కుటుంబ సభ్యులే మహిళలా? నీ నోరు ఏ యాసిడ్‌తో కడగాలి?’’ అంటూ నిప్పులు చెరిగారు.


దుబాయ్‌లో దాచి పెట్టి

తనను ట్రోల్‌ చేసినవారిని కేటీఆర్‌ దుబాయ్‌లో దాచి పెట్టారని ఆరోపించారు. వెంటనే వారిని తీసుకొచ్చి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సినీ పెద్దల స్పందన వెనుక బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారో, లేదో తనకు తెలియదన్నారు. కేటీఆర్‌ ఇచ్చిన నోటీసులను తాను లీగల్‌గా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతండడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.. దీనిపై వివరణ ఇవ్వాలని సురేఖకు సూచించారు. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప.. సమంతా, మీ మనోభావాలను దెబ్బతీయం కాదు’’ అని స్పష్టం చేశారు. ‘స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానమే కాదు.. ఆదర్శం కూడా.


క్షమించండి..

నా వ్యాఖ్యల పట్ల మీరుగానీ, మీ అభిమానులుగానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యధా భావించవద్దు’’ అని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. కేటీఆర్‌పై నిరాధార వ్యాఖ్యలు చేసిన సురేఖపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో గాంధీభవన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాంపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ పార్టీపై హానికర ప్రచారం చేస్తున్న కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణక్క ఉట్నూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.


  • కేటీఆర్‌, హరీశ్‌, పలు యూట్యూబ్‌ చానళ్లపై కేసు

హైదరాబాద్‌ సిటీ: మాజీ మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ రఘునందనరావు మంత్రి కొండా సురేఖకు మాల వేసిన ఘటనను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. పలు యూట్యూబ్‌ చానళుల కూడా ఈ విషయాన్ని ప్రసారం చేశాయి. నకిలీ వార్తలను బీఆర్‌ఎస్‌ అధికారిక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వారితోపాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హరీశ్‌ రావుతోపాటు యూట్యూబ్‌ చానళ్లలో ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రఘునందనరావు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేటీఆర్‌, హరీశ్‌తోపాటు పలు యూట్యూబ్‌ చానళ్లపై కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 04 , 2024 | 12:04 PM