Share News

RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా.. కేసీఆర్ సమక్షంలో త్వరలో బీఆర్ఎస్‌లోకి!

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:50 PM

బహుజన్ సమాజ్ పార్టీ(BSP)కి గట్టి షాక్ తగిలింది. బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

RS Praveen Kumar: బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్  రాజీనామా.. కేసీఆర్ సమక్షంలో త్వరలో బీఆర్ఎస్‌లోకి!

హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ(BSP)కి గట్టి షాక్ తగిలింది. బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

బీజేపీతో పోరాడుతున్న బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తుని ప్రధాని మోదీ భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగుతూ.. కష్టసుఖాలు పంచుకోవడం తాను నమ్మిన ధర్మం అని ప్రవీణ్ అన్నారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని తన ప్రస్థానాన్ని ఆపలేనని స్పష్టం చేశారు.


ఎక్స్‌లో ఏమన్నారంటే..

"ప్రియమైన బహుజనులారా.. నేను ఈ మెసేజ్‌ని టైప్ చేయలేకపోతున్నాను. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున నేను ఈ విషయాన్ని తప్పక పంచుకోవాలి. దయచేసి నన్ను క్షమించండి. నాకు వేరే మార్గం లేదు. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. బీఎస్పీ అధిష్టానం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల పార్టీ రాష్ట్రంలో బలహీనపడింది. అదే సమయంలో నేను కొన్ని ప్రధాన సూత్రాలపై రాజీ పడకూడదనుకుంటున్నాను. స్వేరో గా నేను ఎవరినీ నిందించను. నన్ను నమ్మిన వారిని మోసం చేయను. తెలంగాణలో బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాల్సింది. ఆ పార్టీ అధినేత మాయవతికి ధన్యవాదాలు. నన్ను విశ్వసించినందుకు, నన్ను నడిపించినందుకు ఎప్పటికీ మీరే నా మార్గనిర్దేశకులు. కాన్షీరామ్ సామాజిక న్యాయం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. నాపై విశ్వాసం ఉంచినందుకు బహుజనులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. పవిత్రమైన రాజ్యాంగ విలువలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోను. బహుజనులు స్వశక్తితో ఎదిగేందుకు నిర్విరామంగా కృషిచేస్తానని హామీ ఇస్తున్నాను. నాకు అండగా నిలిచినందుకు తెలంగాణ, భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు. మళ్లీ చెబుతున్నా … చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా. జై భీం..." అని ప్రవీణ్ రాసుకొచ్చారు.

బీఆర్ఎస్ వైపు..

బీఎస్పీకి రాజీనామా చేసిన అనంతరం ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రయాణం ఎటు సాగుతుందనే ఆసక్తి పెరిగింది. ఇటీవలే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. బీఎస్పీకి రాజీనామా చేయడంతో ఆయన త్వరంలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం బీఆర్ఎస్ తరఫున నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆయన పోటీ చేయనున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 03:29 PM