ABN: సాక్షి పాడు బుద్ధి. .ఆధారాలతో బట్టబయలు..
ABN , Publish Date - Oct 06 , 2024 | 01:09 PM
‘సాక్షి’ వెబ్‌సైట్‌లో పోస్టు చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే.. వారికి సాక్షి వెబ్‌సైట్ వార్తలు కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనిపై ఏబీఎన్ వెబ్ సైట్ అనలిస్టు అమర్ మాట్లాడుతూ..
హైదరాబాద్: కుక్క తోక వంకర సామెత వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’కి సరిగ్గా సరిపోతుంది. వార్తల పేరుతో ఇతర పత్రికలు, సంస్థలపై కుట్రలు చేయడం ఆ సంస్థ యాజమాన్యానికి పరిపాటిగా మారింది. తమ అధినేత మెప్పుకోసం పత్రికా విలువలు గాలికొదిలేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ‘సాక్షి’ వెబ్‌సైట్‌లో పోస్టు చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే.. వారికి సాక్షి వెబ్‌సైట్ వార్తలు కనిపించేలా ఏర్పాటు చేశారు.
దీనిపై ఏబీఎన్ వెబ్ సైట్ అనలిస్టు అమర్ మాట్లాడుతూ.. వాస్తవానికి వెబ్‌సైట్‌లో ఒక వార్తను పోస్టు చేసినప్పుడు దానికి సంబంధించి ట్యాగ్, యూఆర్ఎల్, కీ వర్డ్స్ ఉంటాయని, ఆ వార్త దేనికి సంబంధించినదైతే దానికి కీ వర్డ్స్ ఉపయోగిస్తారని.. అలాగే యూఆర్ఎల్ (ఇంగ్లీషు హెడ్డింగ్) కూడా పోస్టు చేస్తారని అన్నారు. అదే సమయంలో ట్యాగ్స్ కూడా ఉపయోగిస్తారని చెప్పారు. ఉదాహరణగా పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, ఏపీ పాలిటిక్స్ ఆ విధంగా ట్యాగ్స్ ఉపయోగిస్తారన్నారు. ఆ ట్యాగ్ టైప్ చేయగానే దానికి సంబంధించిన వార్తలు కనిపిస్తాయన్నారు. ఎవరైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏబీఎన్ లేక ఆంధ్రజ్యోతి న్యూస్ అని టైప్ చేస్తే వాళ్లకు సాక్షి వార్తలు వచ్చే విధంగా చేస్తారన్నారు. సాక్షి వెబ్ సైట్‌ను బలవంతంగా రుద్దేందుకు ఆ యాజమాన్యం చీప్ ట్రిక్స్‌ను ప్రయోగిస్తోందని అమర్ తెలిపారు.
సాక్షి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అని ఒక ట్యాగ్ ఉపయోగిస్తోందని.. ఆ ట్యాగ్‌ను ప్రతి వార్తలో పోస్టు చేయడం వల్ల యూజర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అని టైప్ చేయగానే ఆంధ్రజ్యోతి వైబ్ సైట్ వార్తలతోపాటు సాక్షి వార్తలు కూడా ఓపెన్ అవుతాయని అమర్ అన్నారు. అప్పుడు సాక్షి వార్త మొదట కనిపించడంతో యూజర్ ఆ వార్తనే ఓపెన్ చేసి చూస్తారని తెలిపారు. ఈ చర్యలను వ్యూస్ పెంచుకోడానికి సాక్షి ఉపయోగిస్తున్న చీఫ్ ట్రిక్స్ అని అమర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ధోరణిని ఏ వెబ్ సైట్లూ అనుసరించవని అన్నారు. ఆంధ్రజ్యోతి వెబ్ సైట్‌కు ప్రజాదరణ అధికంగా ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సాక్షి ఇలాంటివి చేస్తోందన్నారు. దీన్ని అనైతిక చర్యగా ఆయన అభివర్ణించారు.
కాగా ఒక పత్రిక లేదా సంస్థ.. ఇతర పత్రికలు, సంస్థలకు సంబంధించిన పేర్లు, ట్యాగ్‌లను తమ వార్తల్లో సహజంగా ఉపయోగించదు. ఎక్కువ మంది ప్రజలు సెర్చ్ చేసే, ట్రెండింగ్ కీ వర్డ్స్, ట్యాగ్‌లను మాత్రమే వాడుతుంది. కానీ సాక్షి మాత్రం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను కొన్ని ఎంపిక చేసిన వార్తలకు వాడుతోంది. ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి.. నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక వ్యూస్, ట్రాఫిక్‌ను పెంచుకునేందుకు అనైతికంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆంధ్రజ్యోతి’కి వ్యతిరేకంగా కొన్ని వార్తలను ప్రచురించి.. వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. పోటీ ప్రపంచంలో తన వెబ్‌సైట్‌కు వీక్షకులను పెంచుకునేందుకు ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఇతర సంస్థలపై కుట్రలు, కుతంత్రాలు పన్నడాన్ని ఎవరూ హర్షించరు..