Phone Tapping: ట్యాపింగ్‌తో పసిగట్టి.. స్టింగ్ ఆపరేషన్!
ABN , Publish Date - Apr 05 , 2024 | 05:52 AM
ఎస్‌ఐబీ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్‌డి్‌స్కల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు.. విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగ్గా.. తాజాగా
మళ్లీ తెరపైకి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు
ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు?
అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్‌కు డీఎస్పీ ఫిర్యాదు
వారం రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐబీ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు.. విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగ్గా.. తాజాగా మొయినాబాద్ ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోనూ లింకులు బయటపడ్డాయి. దీంతో.. మరికొందరు పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2022 నవంబరులో మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి ఈ ఎపిసోడ్‌తో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే..! అయితే.. ఈ నలుగురి ఫోన్లను ఎస్‌ఐబీ డీఎస్పీ హోదాలో ప్రణీత్ అండ్ కో ట్యాప్ చేయడం వల్లే.. అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ఈ విషయాన్ని ముందుగా గుర్తించినట్లు ఇప్పుడు చర్చ జరుగుతోంది. దాంతో.. పక్కాగా స్కెచ్‌వేసి, ఆ నలుగురు ఎమ్మెల్యేలతోనే ప్రధాన నిందితుడు నందకుమార్, సింహయాజి, రామచంద్ర భారతిలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అతి కొద్ది మంది పోలీసు ఉన్నతాధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఒక్కరోజు ముందు కెమెరాలు ఫిక్స్
ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరగడానికి ఒకరోజు ముందు ఎస్‌ఐబీ అధికారులు ఫామ్‌హౌస్‌కు వెళ్లి.. 72 కెమెరాలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి స్వామీజీల సీటింగ్ ఏర్పాట్లు కూడా ప్రణీత్ అండ్ కో డైరెక్షన్‌లోనే జరిగినట్లు.. అందుకు తగ్గట్లుగా ఎమ్మెల్యేలకు తర్ఫీదునిచ్చినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ఫుటేజీలను రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుని, బీజేపీ ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుంది. 2022 నవంబరు 3న అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతిభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఫుటేజీలను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రను గురించి విలేకరులకు వివరించారు. సుప్రీంకోర్టు సహా.. దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు ఈ ఫుటేజీలను పంపినట్లు వెల్లడించారు. ‘‘ఢిల్లీ పెద్దల సంగతి చూస్తాం’’ అని ఘాటుగా హెచ్చరించారు. దర్యాప్తు అధికారులు ఓ దశలో ఈ కేసులో ఢిల్లీ పెద్దల తలుపుతట్టేదాకా పరిస్థితి వెళ్లింది.
దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్!
ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారుల కోసం స్పెషల్ ఫ్లైట్‌ను బుక్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వారు ఢిల్లీతోపాటు.. కేరళలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ పలువురికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే.. దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్‌లను అరేంజ్ చేసిందెవరు? అందులో ప్రయాణించిన అధికారులెవరు? అనే కోణంపైనా ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు దృష్టి సారించారు.
నందకుమార్ ఫిర్యాదు చేశాకే..!
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా పలువురు బాధితులు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే..! ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ఇటీవల డీజీపీ రవిగుప్తాను కలిశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ముందు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. అప్పట్లో డీఎస్పీ ప్రణీత్‌రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు.
స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ ఫిర్యాదు
ప్రస్తుతం అదనపు డీజీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రపై డీజీపీ కార్యాలయంలో పనిచేసే డీఎస్పీ గంగాధర్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓ స్థలం విషయంలో తనపై అకారణంగా సస్పెన్షన్ వేటు వేశారని, దానివల్ల తన పదోన్నతిలో జాప్యం జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సైబరాబాద్ పరిధిలోని నార్సింగ్ ఠాణాకు ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో.. ఓ స్థల వివాదం విషయంలో అప్పటి సీపీ స్టీఫెన్ రవీంద్ర ఏకపక్షంగా అవతలివైపు వారి వాదనలను విని.. ఎలాంటి విచారణ జరపకుండానే తనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఈ విషయంలో పునరాలోచించి, విచారణ జరిపించాక నిర్ణయం తీసుకోవాలని తాను విన్నవించినా పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఈ చర్య వల్ల గుండెపోటుతో నేను ఆస్పత్రిలో చేరాను. ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతిలో తీవ్ర జాప్యం జరిగింది’’ అని ఆ ఫిర్యాదులో డీజీపీకి విజ్ఞప్తి చేశారు. 1988లో ఎస్సైగా సర్వీసులోకి వచ్చిన తాను.. కఠిన సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాలను అందుకున్నానని, ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క చార్జ్‌మెమోను కూడా అందుకోలేదని, అలాంటి క్లీన్ రికార్డు ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన వాపోయారు. ఇదే అంశంపై ఆ డీఎస్పీ పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. వారం రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో.. పశ్చిమ మండలం పోలీసులు రాధాకిషన్‌ను విచారిస్తున్నారు. ప్రణీత్‌రావు ఎస్‌ఐబీలో ధ్వంసం చేసిన హార్డ్‌డి్‌స్కల శకలాలను పారవేయడంలో రాధాకిషన్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వామికార్యంతోపాటు.. స్వకార్యం(వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్‌లు, బెదిరింపులు) పూర్తిచేసుకున్న ఈ బృందం.. తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకే.. హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేసినట్లు సమాచారం. దాంతోపాటు.. అరెస్టు సమయంలో జరిపిన ప్రాథమిక దర్యాప్తులో బీఆర్‌ఎస్ కోసం టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బును తరలించినట్లు అంగీకరించిన నేపథ్యంలో.. ఆ కోణంపై మరింత సమాచారాన్ని సేకరించనున్నారు. ఎన్నికల సమయంలో సైబరాబాద్‌కు వేణుగోపాల్‌రావు, హైదరాబాద్‌కు తిరుపతన్న, రాచకొండకు భుజంగరావు, నల్లగొండకు ప్రణీత్‌రావును ఇన్‌చార్జిగా పెట్టి, సీక్రెట్‌గా చేసిన ‘స్పెషల్ ఆపరేషన్’ ఏమిటనే కోణంలోనూ రాధాకిషన్‌ను ప్రశ్నించనున్నారు. మరోవైపు.. మొయినాబాద్ ఫామ్‌హౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులోనూ రాధాకిషన్‌రావు పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. ఆ కోణంలోనూ విచారించే అవకాశాలున్నాయి.