Share News

Delhi: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ..

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:42 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం నాడు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన సీఎం ఇవాళ(గురువారం) ఢిల్లీకి చేరుకున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

Delhi: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ..
Telangana CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం నాడు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన సీఎం ఇవాళ(గురువారం) ఢిల్లీకి చేరుకున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సీఎం సమావేశం కానున్నారు. రాత్రి ఏడు గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. చర్చల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.


అధిష్ఠానంతో చర్చలు..

ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో మంగళవారం సీఎం చర్చలు జరిపారు. ఈ మేరకు ఏడాది పాలనకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. బుధవారం బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌కు వెళ్లారు.


ఈ సందర్భంగా సీఎంకు విమానాశ్రయంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్‌ చరణ్‌లు ఘనస్వాగతం పలికారు. వివాహ వేడుకల అనంతరం నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసి అనంతరం శుక్రవారం నాడు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. ప్రగతి నివేదికలో భాగంగా గ్యారెంటీల అమలుతోపాటు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్‌ తదితర పథకాల అమలు, కులగణన వంటి అంశాలను అధిష్ఠానానికి వివరించనున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం పెద్దలతో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సీఎంతో కలిసి పలువురు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపైన కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 12 , 2024 | 05:56 PM