HYDRA: టార్గెట్ ఫిక్స్.. హైడ్రా వెనుక పక్కా ప్లాన్ ఉందా
ABN , Publish Date - Aug 29 , 2024 | 09:36 PM
హైడ్రా కూల్చివేతలపై కొద్దిరోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తాము వ్యతిరేకం కాదని.. ముందు తన ఇంటి నుంచి మొదలు పెట్టాలంటూ బీఆర్‌స్ నేతలు..
హైదారాబద్‌లో హైడ్రా దూకుడు తగ్గడం లేదు.. రోజురోజుకు యమ స్పీడ్‌లో దూసుకుపోతుంది. తన, మన బేధాలు లేకుండా అందరికీ ఒకటే రూల్ అంటూ చుక్కలు చూపిస్తోంది. చివరికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడుని హైడ్రా వదిలిపెట్టలేదు. చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించి కట్టిన భవనాల్లో ఉంటున్నవారు ఎంతటి వారైనా వదలిపెట్టేది లేదంటోంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి కూల్చివేత నోటీసులు అంటించారు. తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రస్తుతం ఈ అంశం హట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో వెలిశాయి. అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన శేరిలింగంపల్లి తహశీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు.
Hydra News: హైడ్రా సంచలన నిర్ణయం! రంగం సిద్ధం!
భిన్నాభిప్రాయాలు..
హైడ్రా కూల్చివేతలపై కొద్దిరోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తాము వ్యతిరేకం కాదని.. ముందు తన ఇంటి నుంచి మొదలుపెట్టాలంటూ బీఆర్‌స్ నేతలు డిమాండ్ చేశారు. సీఎం సొంత సోదరుడు ఎఫ్‌టిఎల్ పరిధిలో నివసిస్తున్నారని.. ఆయన భవనం కూల్చిన తర్వాత మిగతావి కూల్చాలని స్వయంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా తిరుపతిరెడ్డి నివాసానికి అధికారులు నోటీసులు జారీచేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. సొంత సోదరుడిని వదలిపెట్టకపోవడంతో ఇక బీఆర్‌ఎస్ నేతలకు చెందిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపనున్నట్లు స్పష్టమవుతోంది. తిరుపతిరెడ్డికి చెందిన భవనానికి నోటీసులు ఇవ్వడంతో మరికొద్దిరోజుల్లో హైడ్రా అధికారులు ఆ భవనంతో పాటు చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం లాంఛనమే కానుంది. సొంత సోదరుడిని వదిలిపెట్టకపోవడంతో రేవంత్‌కు ప్రజల మద్దతు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రజలు హైడ్రాకు జేజేలు కొడుతున్న సంగతి తెలిసిందే.
Hydra: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కీలక ప్రకటన
పక్కా ప్లాన్..
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి పక్కాప్లాన్‌తోనే హైడ్రాను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభిస్తే సొంత పార్టీ నేతలు ఇబ్బందులు పడతారని తెలిసినా.. అన్నింటికి సిద్ధపడే ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. హైడ్రా ఇదే దూకుడుతో ముందుకెళ్తే హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, నాళాలను సంరక్షించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు కోర్టు కూడా నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం తప్పితే.. ఎక్కడా కూల్చివేతలను ఆపేయాలని స్టే ఇవ్వడం లేదు. మరోవైపు హైడ్రాకు భవిష్యత్తులో మరిన్ని అధికారాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు.
TG News: ‘రేవంతన్నా నీ పౌరుషం ఏమైంది’.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News