Share News

Mohanbabu: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మోహన్‌బాబు అరెస్ట్ ఎప్పుడంటే

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:23 PM

Telangana: నటుడు మోహన్‌ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 24 వరకు మోహన్‌బాబుకు కోర్టు గడువు ఇచ్చిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్‌బాబుకు...

Mohanbabu: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మోహన్‌బాబు అరెస్ట్ ఎప్పుడంటే
Actor Manchu Mohan babu

హైదరాబాద్, డిసెంబర్ 23: నటుడు మంచు మోహన్ బాబుకు (Actor Manchu mohan babu) తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మోహన్‌బాబుపై రాచకొండ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో మోహన్‌ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై గతంలో హైకోర్టులో విచారణకు రాగా.. ఈరోజు మరోసారి మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.


మరోవైపు మోహన్ బాబు అరెస్ట్‌ కోసం రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈనెల 24 వరకు మోహన్‌ బాబుకు కోర్టు గడువు ఇచ్చిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్‌బాబుకు నోటీసులు ఇస్తామని, చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ వెల్లడించారు. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరుకాని పక్షంలో తగిన చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. విచారణకు రావాల్సిందిగా మోహన్‌బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేయనుండగా.. విచారణకు వచ్చేందుకు సమయం కావాలని మోహన్ బాబు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోటీసులకు స్పందించని పక్షంలో మోహన్ బాబు అరెస్ట్ ఖాయమని రాచకొండ పోలీసులు చెబుతున్నారు.


కాగా.. జన్‌పల్లిలో మంచు మోహన్‌బాబు, మంచు మనోజ్‌కు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో.. ఆ వార్తలను కవరేజ్ చేసేందుకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో సదరు జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి నేపథ్యంలో మోహన్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేయగా.. జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో ఆ కేసు కాస్తా హత్యాయత్నం కేసుగా మార్చారు. అనంతరం మోహన్‌బాబు కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల నోటీసులకు కూడా స్పందించలేదు. దాంతో మోహన్‌బాబు పరారయ్యారంటూ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన మోహన్‌ బాబు.. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. విశ్రాంతి తీసుకుంటున్నానని, మెడికేషన్‌లో ఉన్నానని పోలీసులకు సమాచారం అందించారు. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్‌ కోసం మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా మోహన్‌ బాబు పిటిషన్‌పై రెండు సార్లు విచారణ జరుగగా నేటికి వాయిదా వేసింది. ఈరోజు విచారణలో భాగంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం మోహన్‌ బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసుల నోటీసులకు స్పందించని పక్షంలో మోహన్ బాబు అరెస్ట్ తప్పదా... మోహన్ బాబు విషయంలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ సర్వాత్ర నెలకొంది.


ఇవి కూడా చదవండి...

నోటీసులకు స్పందించిన పేర్ని నాని కుటుంబం..

గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 04:22 PM