TPCC Chief: కొలిక్కొచ్చిన టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ.. ప్రకటన ఎప్పుడంటే..!?
ABN , Publish Date - Jul 30 , 2024 | 09:26 AM
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై దాదాపుగా స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. టీ పీసీసీ పోస్ట్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జోరుగా లాబీయింగ్ చేశారు. కొద్దిరోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరికి హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గుచూపారని విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై (Tpcc Chief) దాదాపుగా స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. టీ పీసీసీ పోస్ట్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జోరుగా లాబీయింగ్ చేశారు. కొద్దిరోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరికి హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గుచూపారని విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరనే అంశం కొద్దిరోజుల్లో తేలనుంది.
అంతా ఓకే.. కానీ
పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఇటీవల పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు. మంత్రులు, కీలక నేతల సూచనలను కూడా అధిష్ఠానం పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్టీ (లంబాడ) సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతని అభ్యర్థిత్వంపై సీఎం రేవంత్ సహా మంత్రులు, కీలక నేతలు సానుకూలంగా ఉన్నారని సమాచారం. అందరి అభిప్రాయం తీసుకునే బలరాం నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని, ప్రకటించడమే మిగిలి ఉందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
ఆలస్యం ఎందుకంటే..?
పీసీసీ చీఫ్ అభ్యర్థిత్వం కన్ఫామ్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేనెల 2వ తేదీ నుంచి విదేశాలకు వెళుతున్నారు. ఫారిన్ టూర్ ముగించుకొని 14వ తేదీన స్వదేశం తిరిగొస్తారు. ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తారు. సీఎం రేవంత్ రాష్ట్రంలో ఉండకపోవడంతో పీసీసీ చీఫ్ అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై స్పష్టత వచ్చిందని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు కార్యనిర్వహక అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది.
రెండు పదవులు
గత 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి సీఎం పదవితోపాటు పీసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి, పార్టీని విజయతీరాలకు చేర్చారు. రేవంత్‌ను సీఎం పదవి వరించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటికీ పీసీసీ చీఫ్‌ను హైకమాండ్ ఎంపిక చేయలేదు. వివిధ కారణాలతో ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. వెంటనే లోక్ సభ ఎన్నికలు, ఇతర అంశాలతో అగ్ర నేతలు తీరిక లేకుండా గడిపారు. దాంతో పీసీసీ చీఫ్ అభ్యర్థి అంశం పెండింగ్‌లో ఉంది. ఇన్నాళ్లకు అభ్యర్థిని ఖరారు చేశారు. కొద్దిరోజుల్లో పేరు ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telugu News and Telangana News