Share News

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 14 , 2024 | 08:19 AM

అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తాను ఎవరిపై ఆరోపణలు చేయడం లేదని చిన్ని కృష్ణ వెల్లడించారు. యావత్ భారతదేశం మొత్తం దుఖంలో ఉందని.. ఆ రియాక్షన్ ఏమిటో త్వరలో చూస్తారని ఆయన పేర్కొన్నారు.

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, డిసెంబర్ 14: పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ప్రముఖ సినిమా మాటల రచయిత చిన్ని కృష్ణ ఖండించారు. ఆయన అరెస్ట్ అన్యాయం, అక్రమమని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావాలని చేసిందేనని చిన్ని కృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ అరెస్ట్‌ను ఎవరు సహించేది లేదన్నారు. పుష్ప ఈజ్ నాట్ ఏ ఫ్లవర్ అని ఆయన పేర్కొన్నారు. మానవత్వానికి పరాకాష్ట మెగా ఫ్యామిలీ అని అభివర్ణించారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల కావడంపై చిన్ని కృష్ణ స్పందించారు. శనివారం హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసం వద్ద చిన్ని కృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తాను ఎవరిపై ఆరోపణలు చేయడం లేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


యావత్ భారతదేశం మొత్తం దుఖంలో ఉందని.. ఆ రియాక్షన్ ఏమిటో త్వరలో చూస్తారన్నారు. ఇంతకంటే నీచమైన.. నికృష్టమైన అరెస్ట్ ఈ భూమండలం మీద జరగలేదని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తాము వంద శాతం అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని.. అయితే అల్లు అర్జున్‌పై చట్టపరంగా పెట్టిన ప్రతి సెక్షన్ తప్పు అని చిన్ని కృష్ణ తెలిపారు.


దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ సభల సందర్బంగా జరిగిన తొక్కిసలాటల్లో పలువురు మృతి చెందారన్నారు. తాను ఇంద్ర సినిమాకు పని చేశానని.. ఆ సమయంలో సైతం కొందరు వ్యక్తులు మరణించారని ఈ సందర్బంగా చిన్ని కృష్ణ గుర్తు చేశారు. అన్ని సినిమాలకు ఇచ్చినట్లే పుష్ప 2 సినిమాకు సైతం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదని చెప్పారు. ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ చట్టపరంగా పెట్టిన సెక్షన్లు అన్ని తప్పు అని చిన్ని కృష్ణ పేర్కొన్నారు.


డిసెంబర్ 5 వ తేదీన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్యా థియేటర్‌కు భారీగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని ఫ్యాన్స్‌తో కలిసి చూసేందుకు అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సదరు మహిళ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 08:37 AM