Share News

Hyderabad: హైడ్రాను ఆపేదెలా?.. ఉన్నతస్థాయి చర్చలు!

ABN , Publish Date - Aug 20 , 2024 | 05:07 AM

జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) చేపట్టిన ఆపరేషన్‌తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది.

Hyderabad: హైడ్రాను ఆపేదెలా?.. ఉన్నతస్థాయి చర్చలు!

  • గండిపేటలో కూల్చివేతతో ప్రముఖుల్లో గుబులు

  • దూకుడును ఆపేందుకు ఉన్నతస్థాయి చర్చలు!

  • మంత్రులు, అధికారుల వద్దకు అక్రమార్కులు

  • సీఎస్‌తో కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ భేటీ

  • జలాశయాల్లో కూల్చివేత వివరాల సమర్పణ

  • ఒకట్రెండు రోజుల్లో రెండో విడత ఆపరేషన్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) చేపట్టిన ఆపరేషన్‌తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది. ముచ్చటపడి కట్టుకున్న ఫామ్‌హౌ్‌సలు, పచ్చటి ప్రకృతి అందాల మధ్య నిర్మించుకున్న భవనాలు ఎక్కడ నేలమట్టమవుతాయో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో.. హైడ్రా పంజా తమ నిర్మాణాల దాకా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులు, ఉన్నతాధికారుల ద్వారా మంత్రాంగం మొద లెట్టారు.


అయితే.. హైడ్రా వర్గాలు మాత్రం.. ‘ఒత్తిళ్లకు తలొగ్గం.. ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చకుండా వదలం’ అని తేల్చిచెబుతున్నా యి. వరుస కూల్చివేతల నేపథ్యంలో రెండు రోజు లు బ్రేక్‌ ఇచ్చామని.. త్వరలో మళ్లీ ఆపరేషన్‌ డిమాలిషన్‌ మొదలవుతుందని ఓ అధికారి చెప్పారు. మరోవైపు, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌.. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమయ్యారు. గండిపేటలో కూల్చిన భవనాలు, ప్రహరీ గోడ ల వివరాలను రంగనాథ్‌ ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది. హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో గుర్తించిన నిర్మాణాల సమాచారమూ అందించినట్టు తెలుస్తోంది.


  • ఆపరేషన్‌ను అడ్డుకునేలా...

హిమాయత్‌ సాగర్‌లో గుర్తించిన అక్రమ నిర్మాణాల్లో.. గత, ప్రస్తుత ప్రభుత్వంలోని పలువురితోపాటు.. ప్రముఖ వ్యాపార సంస్థల యజమానులు, సినీ ప్రముఖులకు చెందిన ఫామ్‌హౌ్‌సలు, భవనాలున్నాయి. ఉదాహరణకు.. శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడలో ఓ ఎమ్మెల్సీ ఫామ్‌హౌస్‌ ఉంది. 20యేళ్ల క్రితం దాన్ని నిర్మించారని చెబుతున్నారు. అలాగే.. అజీజ్‌నగర్‌లో మాజీ మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నిర్మాణాలున్నాయి. పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులూ ఇక్కడ ఫామ్‌హౌ్‌సలు నిర్మించారు.


నాగిరెడ్డిగూడ వైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న వాటిని ఇప్పటికే గుర్తించిన హైడ్రా.. కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో ఇప్పుడు వారంతా అప్రమత్తమయ్యారు. మంత్రులు, పరిచయస్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలను సంప్రదించి.. కూల్చివేతలను ఆపేందుకువిశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే, స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటుచేసిన హైడ్రాకు పూర్తిస్వేచ్ఛనిచ్చిన సర్కారు.. కూల్చివేతల విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూప డం లేదని, వాటి గురించి తమ వద్ద ప్రస్తావించొద్దని సుతిమెత్తగా చెబుతున్నట్టు సమాచారం.


నిజానికి, గండిపేటలోనే కూల్చివేతలను ఆపేందుకు పలువురు ప్రముఖులు.. మంత్రులు, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినా వారి యత్నాలు ఫలించలేదు. హైడ్రా అధికారులకూ పదుల సంఖ్యలో ఫోన్లు వచ్చినా.. వాళ్లు మొబైల్స్‌ స్విచ్ఛాఫ్‌ చేసినట్టు సమాచారం. అలాగే.. ప్రగతినగర్‌ ఎర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో హెచ్‌ఎండీఏ అనుమతితో నిర్మించిన మూడు స్టిల్ట్‌ ప్లస్‌ ఐదంతస్తుల భవనాలను ఇటీవల నేలమట్టం చేశారు. కూల్చివేతలు ఆపాలని ఓ మంత్రిని ఆశ్రయించినా ఆయన చేతులెత్తేసినట్టు తెలిసింది.


  • ఆక్రమణలతో...

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ (జంట జలాశయాలు) ఒకప్పుడు భాగ్యనగరానికి ప్రధాన తాగునీటి వనరులు. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఉస్మాన్‌సాగర్‌ 24 చదరపు కి.మీలు, 2.9 టీఎంసీ నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన హిమాయత్‌సాగర్‌ సుమారు 20 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఉంది. కాలగమనంలో ఈ జలాశయాల 15 నుంచి 20 శాతం వరకు విస్తీర్ణం కుచించుకుపోయింది. ఈ రెండింటి పరీవాహక ప్రాంతం లో 11,887 అక్రమ నిర్మాణాలున్నట్టు వాటర్‌బోర్డు గుర్తించింది. ఆ ప్రాంతంలో జీవో-111 నిబంధనలు ఉల్లంఘిస్తు అక్రమంగా వెలిసిన నిర్మాణాలు వరద ప్రవాహానికి ప్రతిబంధకంగా మారాయి. నీటి రాక తగ్గడంతో అక్రమార్కులు మట్టితో నింపి చదును చేసి భూముల విక్రయం మొదలుపెట్టారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బడా వ్యాపారులు, సినీ ప్రముఖులు ఆ స్థలాలు కొన్నారు.


జీవో-111 అమలులో ఉన్నప్పుడు అక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అవకాశం లేకపోవడంతో ప్రకృతి ఒడిలో గడపొచ్చనే ఉద్దేశంతో ఫామ్‌హౌ్‌సలు నిర్మించుకున్నారు. వాటిలో కొన్ని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్నాయి. వాటిపై స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు.. అక్కడ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న పలు నిర్మాణాలను గుర్తించారు. గండిపేటలో ఆదివారం 20కిపైగా భవనాలు, పలు ప్రహరీగోడలను కూల్చివేశారు. మీర్జాగూడ, జన్వాడ ప్రాంతాల్లోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని మరిన్ని నిర్మాణాలపైనా చర్యలుంటాయని, త్వరలో హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ లో నిర్మాణాల కూల్చివేత ఉంటుందని సమాచారం.

Updated Date - Aug 20 , 2024 | 07:12 AM