Supreme Court: హైడ్రాకు సొంత సామగ్రి
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:36 AM
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆపరేషన్ వేగం పుంజుకోనుంది.
ఏజెన్సీ ఎంపికకు టెండర్ నోటిఫికేషన్
భారీ యంత్రాలను సమకూర్చుకోనున్న సంస్థ
కూల్చివేత.. వ్యర్థాల తరలింపు బాధ్యత వారిదే
ఇప్పటివరకు కూల్చిన వ్యర్థాలు చెరువుల్లోనే
నిర్మాణదారులకు ఉచితంగా మట్టి పంపిణీ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆపరేషన్ వేగం పుంజుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్యలను ముమ్మరం చేయనుంది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఏజెన్సీల ద్వారా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇకపైన మాత్రం ఆక్రమణల కూల్చివేత, వ్యర్థాల తరలింపునకు అవసరమైన యంత్రాలు, వాహనాలను సొంతంగా సమకూర్చుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏజెన్సీ ఎంపికకు గురువారం టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు బిడ్‌లు దాఖలు చేయాలని సూచించింది.
భారీ భవనాలను నేలమట్టం చేస్తోన్న నేపథ్యంలో అధునాతన సాంకేతికతతో పనిచేసే హై రీచ్ జా క్రషర్, హై రీచ్ రాక్ బ్రేకర్‌లను వినియోగిస్తున్నారు. వీటికి సంబంధించి ప్రామాణిక ధరల పట్టిక (స్టాండర్ట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ -ఎస్‌ఎ్‌సఆర్) ఏ ప్రభుత్వ విభాగం వద్ద లేదు. దీంతో యూనిట్ల వారీగా ధరల నిర్ధారణ అంశాన్నీ హైడ్రా టెండర్‌లో పేర్కొంది. చదరపు మీటర్లు/క్యూబిక్ మీటర్లు/గంటల ప్రతిపాదికన ఏజెన్సీలు ధరలు కోట్ చేయాలి. భవనాల కూల్చివేతలలో స్టీల్‌ను ఏజెన్సీ తీసుకుంటే హైడ్రా ఎంత చెల్లించాలి? స్టీల్ లేకుండా ఎంత చెల్లించాలన్న దానిపై వేర్వేరుగా కొటేషన్లు ఆహ్వానించారు.
ఎంపికైన ఏజెన్సీ ఏడాదిపాటు పని చేయాల్సి ఉంటుంది. కాగా, 2 నెలల్లో 262 ఆక్రమణలను కూల్చి.. 111 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. వ్యర్థాల తరలింపును చేపట్టలేదు. ఈ క్రమంలోనే కూల్చివేత, తరలింపు బాధ్యతలను ఒకే ఏజెన్సీకి అప్పగించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. తమ్మిడికుంట చెరువులోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడి వ్యర్థాల తరలింపు ఉండదని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. ఈర్ల కుంట చెరువుపై కోర్టు ఆదేశాలున్నందున అక్కడి వ్యర్థాలనూ తరలించరు.
మట్టి ఉచితంగా..
చెరువుల్లోని కూల్చివేత వ్యర్ధాలను తొలగించడంతోపాటు.. పూడిక తీయాలని భావిస్తున్నారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో భూమిలోకి వర్షపు నీరు ఇంకే పరిస్థితి లేదు. చెరువుల నీటి నిల్వ సామర్ధ్యం పెంపు ద్వారా భూగర్భ జలాల రక్షణకు చర్యలు తీసుకోవాలని సర్కారు ఆలోచిస్తోంది. చెరువుల్లో పూడిక తీసి మట్టిని ఉచితంగా నిర్మాణ రంగ అవసరాలకు ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. రవాణా చార్జీలను వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. భవన నిర్మాణాల్లో ఫౌండేషన్ స్థాయిలో మట్టిని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం టిప్పర్‌కు ఇంత అని కొనుగోలు చేస్తున్నారు. హైడ్రా ఉచితంగా అందిస్తే.. వాహనంతో తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఇద్దరికీ మేలని హైడ్రా భావిస్తోంది. మట్టి తొలగించే ప్రొక్లెయినర్‌నూ హైడ్రా ఏర్పాటు చేయనుంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలోని తమ్మిడికుంట, కాముని, మైసమ్మ తదితర చెరువులను గొలుసుకట్టుగా అభివృద్ధి చేయాలని సంస్థ నిర్ణయించింది.