HYDRA: N కన్వెన్షన్ కూల్చివేతపై రంగనాథ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:46 PM
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు...
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను (N Convention) హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఘటన అటు సినీ పరిశ్రమలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మూడున్నర ఎకరాలు తుమ్మడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా నేలమట్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టును (High Court) ఆశ్రయించడంతో నాగార్జునకు (Akkineni Nagarjuna) భారీ ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కూల్చివేతకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
అంతా అబద్ధమే..!
‘హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు, ఖానామెట్ గ్రామం, మాదాపూర్‌లోని ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్.. రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణలను తొలగించారు. తొలగించబడిన అనేక అనధికార నిర్మాణాలలో N- కన్వెన్షన్ కూడా ఒకటి. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశాం. హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవం. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదు. FTLలో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్‌ను గతంలోనే అధికారులు తిరస్కరించారు. ఎన్ కన్వెన్షన్‌లో పూర్తిగా కట్టడాలను నేలమట్టం చేశాం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు.
ఇదీ అసలు కథ..!
‘2014లో హెచ్ఎండీఏ తమ్మిడికుంట సరస్సు పూర్తి ట్యాంక్ స్థాయి (FTL)/బఫర్ జోన్‌లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ జారీ చేయబడింది. 2014లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత N – కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్‌టిఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం పిటిషనర్ ఎన్ కన్వెన్షన్ సమక్షంలో FTL సర్వే నిర్వహించబడింది.. సర్వే నివేదిక వారికి తెలియజేయబడింది. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అడిల్‌ను సంప్రదించింది. 2017లో సర్వే నివేదికపై జిల్లా జడ్జి కోర్టు.. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఏ కోర్టు నుండి ఎటువంటి స్టే ఉత్తర్వులు లేవు’ అని క్లియర్ కట్‌గా కమిషనర్ చెప్పారు.
నో పర్మిషన్..!
‘N కన్వెన్షన్ బఫర్ జోన్‌లలో నిర్మించిన అనధికారిక నిర్మాణాల ద్వారా సిస్టమ్స్, ప్రాసెస్‌ను స్పష్టంగా తారుమారు చేస్తోంది.. వారి వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎకరా 12 గుంటలను ఆక్రమించిన ఎన్ కన్వెన్షన్, 2 బఫర్ జోన్‌లో ఎకరాల 18 గుంటలు, అనధికారిక నిర్మాణాలను పెంచారు. ఈ కన్వెన్షన్‌కు జీహెచ్ఎంసీ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. తమ్మిడికుంట చెరువు, చుట్టుపక్కల మాదాపూర్, హైటెక్స్ పరిసర ప్రాంతాలను అనుసంధానించే నాలాలలో తనిఖీలు చేయని ఆక్రమణల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 50-60% మేర కుంచించుకుపోవడంతో తమ్మిడికుంట చెరువు దిగువ ప్రాంతాలు నిత్యం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ముంపునకు గురవుతున్నాయి. దిగువ, మధ్యతరగతి ప్రజలకు చెందిన అనేక ఇళ్ళు ఈ దిగువ ప్రాంతాలలో మునిగిపోతున్నాయి. ఫలితంగా వారికి తీవ్ర ఆస్తి నష్టం జరుగుతోంది. నిర్ణీత ప్రక్రియను అనుసరించి, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఈరోజు ఉదయం తమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. తెలంగాణ హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం మధ్యంతర స్టే ఇచ్చింది’ అని ఏవీ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.