Share News

A.V. Ranganath: మూసీ మార్కింగ్‌తో సంబంధం లేదు..

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:27 AM

మూసీకి ఇరువైపులా చేసిన సర్వే, మార్కింగ్‌తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితులను తరలించడం లేదని, నది సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతున్నదని పేర్కొన్నారు.

A.V. Ranganath: మూసీ మార్కింగ్‌తో సంబంధం లేదు..

  • నిర్వాసితుల తరలింపూ మా పరిధి కాదు

  • చెరువులు, నాలాల పునరుద్ధరణే లక్ష్యం

  • పేదలు, మధ్య తరగతి వారి ఇళ్ల జోలికెళ్లం

  • హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మూసీకి ఇరువైపులా చేసిన సర్వే, మార్కింగ్‌తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితులను తరలించడం లేదని, నది సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతున్నదని పేర్కొన్నారు. మూసీ తీర ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణాలను సంస్థ నేలమట్టం చేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. హైడ్రా ముఖ్య ఉద్దేశం కూల్చివేతలు కాదని.. చెరువులు, నాలాల పరిరక్షణ, పునరుద్ధరణ, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించడమని తెలిపారు.


చెరువుల నగరంగా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌లో జలాశయాలకు వీలైనంత మేర పూర్వ వైభవం తీసుకురావడం.. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాలాలు, కాల్వల వెంట ఆక్రమణలను తొలగించి వరద నీరు సాఫీగా ప్రవహించేలా చూస్తామన్నారు. రెవెన్యూ, సాగునీటి, జాతీయ, రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ విభాగాలతో అధ్యయనం చేయించి చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల నిర్ధారణకు హైడ్రా కృషి చేస్తుందని రంగనాథ్‌ తెలిపారు. వర్షపు నీటి నిల్వ, వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుపర్చడం ద్వారా రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడం తమ లక్ష్యంగా వివరించారు.


పేద, మధ్య తరగతి వర్గాల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లోని కూల్చివేతలనూ హైడ్రాకు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాలలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మొద్దని కోరారు. హైడ్రా పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకే అని తేల్చి చెప్పారు. ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా.. విపత్తు నిర్వహణకు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు ఏం చేయాలన్నదానిపై హైడ్రా అధ్యయనం చేసి కారణాలను గుర్తించి పరిష్కారాలనూ సూచిస్తుందని తెలిపారు. ట్రాఫిక్‌ రద్దీతో పర్యావరణంపై పడనున్న ప్రభావాన్ని గుర్తిస్తూ.. చేపట్టాల్సిన కాలుష్య రహిత చర్యలపై పలు సూచనలు చేస్తామన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా ముందుగానే అప్రమత్తమై విపత్తు నిర్వహణ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కూలిన చెట్లు, రోడ్లు, ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలగిస్తున్నాయన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 03:27 AM