Share News

Hydra Commissioner: ఎఫ్‌టీఎల్‌లో సుందరీకరణా?

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:57 AM

చెరువు ఎఫ్‌టీఎల్‌లో సుందరీకరణ పనులా? ఇరిగేషన్‌ అధికారులు ఎలా అనుమతించారు? ప్రభుత్వ విభాగాలే ఇలా నిర్మాణాలు చేపడుతాయా? అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ విస్మయం వ్యక్తం చేశారు.

Hydra Commissioner: ఎఫ్‌టీఎల్‌లో సుందరీకరణా?

  • మీర్‌ పేటలో మూడు చెరువుల సందర్శన

  • రాంనగర్‌లో నాలా ఆక్రమణల పరిశీలన

  • రికార్డుల ప్రకారం చర్యలు చేపట్టాలని

  • అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు

  • హైడ్రాకు వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులు

హైదరాబాద్‌ సిటీ/రాంనగర్‌, సికింద్రాబాద్‌, చంపాపేట, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): చెరువు ఎఫ్‌టీఎల్‌లో సుందరీకరణ పనులా? ఇరిగేషన్‌ అధికారులు ఎలా అనుమతించారు? ప్రభుత్వ విభాగాలే ఇలా నిర్మాణాలు చేపడుతాయా? అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ విస్మయం వ్యక్తం చేశారు. మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మంత్రాల చెరువు, పెద్దచెరువు, జిల్లెలగూడలో ఉన్న చంద చెరువును బుధవారం ఆయన సందర్శించారు. సుందరీకరణ పేరుతో మూడు చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో బండ్‌(కట్ట)లు, పాత్‌ వేలు, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటివి చేపట్టడంపై ఇరిగేషన్‌ శాఖ ఎన్‌వోసీతోనే ఈ పనులు చేశారా? అని అధికారులను ప్రశ్నించారు.


రాజకీయ ఒత్తిళ్లతో సుందరీకరణ చేపట్టారని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చంద చెరువు వద్ద ఓ ఫంక్షన్‌ హాల్‌లోని కొంత భాగంతోపాటు పార్కింగ్‌ ప్రాంతం ఎఫ్‌టీఎల్‌లోనే ఉందన్న ఫిర్యాదు నేపథ్యంలో ఆ ప్రాంతాన్నీ రంగనాథ్‌ పరిశీలించారు. అక్కడ ఉన్న ఎఫ్‌టీఎల్‌ దిమ్మెను చూసి, దీని ఇక్కడేనా ఉండేది? అని ప్రశ్నించారు. ఫంక్షన్‌ హాల్‌ యజమానులు తమ వద్ద ఉన్న రికార్డులను చూపించగా, అధికారులకు సమర్పించాలని సూచించారు. మంత్రాల చెరువు, పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ ప్రాంతం సైతం కబ్జాకు గురైనట్టు ఆయన గుర్తించారు. లెనిన్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు.


ఆయా చెరువుల్లోని ఆక్రమణదారులకు గతంలో ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఆక్రమణలను కూల్చేశారా? అని బాలాపూర్‌ రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి తనకు అందజేయాలని, దాని ఆధారంగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారం పరిధిలోని సర్వే నంబర్‌ 125లో ఉన్న ప్లాట్లు ఫతుల్లాగూడ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేవని, హైడ్రాకు కొంత మంది తప్పుడు సమాచారం ఇచ్చారని సదరు ప్లాట్ల యజమానులు పేర్కొన్నారు. అలాగే, రాంనగర్‌లోని మణెమ్మ గల్లీలో నాలాను జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలిసి రంగనాథ్‌ పరిశీలించారు. వర్షం పడితే బస్తీ నుంచి వరద నీరు బయటకు వెళ్లే దారి లేక ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డు ఆక్రమణలతో బస్తీలోకి అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి కూడా లేకుండాపోయిందని చెప్పారు.


దీనిపై స్పందించిన రంగనాథ్‌.. రికార్డుల ప్రకారం నాలాను గుర్తించి, ఆక్రమణలు ఉంటే తొలగించాలని అధికారులను ఆదేశించారు. గురువారమే చర్యలకు శ్రీకారం చుట్టాలని, అవసరమైతే పోలీస్‌ బందోబస్తు తీసుకోవాలని సూచించారు. కాగా, చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుద్ధ భవన్‌లోని కార్యాలయానికి వచ్చి నేరుగా రంగనాథ్‌కే కొందరు ఫిర్యాదు చేస్తుండగా.. మరికొందరు టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్లు చేస్తున్నారు. చెరువుల మ్యాపులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ వివరాలు తెలియజేస్తూ ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తున్నారు. 15 రోజుల్లోగా ఫిర్యాదుపై స్పందన రాకుంటే మరోసారి వచ్చి కలవాలని పౌరులకు రంగనాథ్‌ సూచిస్తున్నారు. ఫిర్యాదులపై కొన్ని ప్రాంతాలకు హైడ్రా బృందాలు నేరుగా వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం మీర్‌పేట, రాంనగర్‌ ప్రాంతాలను రంగనాథ్‌ పరిశీలించారు.


  • హైదరాబాదీల సమస్యలకు హైడ్రా పరిష్కారం : మల్లు రవి

హైదరాబాద్‌ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు హైడ్రా శాశ్వత పరిష్కారం చూపుతోందని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. హైడ్రా కూల్చివేత పనులకు అన్ని వర్గాలు, పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని చెప్పారు. ఆక్రమణలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందన్నారు. గత సర్కారు హైదరాబాద్‌ను పట్టించుకోలేదని.. చిన్న వానకే పలు ప్రాంతాలు జలమయమై పోతున్నాయన్నారు. తెలంగాణను లూటీ చేసి మద్యం కుంభకోణంలో జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చిన కవితను కడిగిన ముత్యం అనడానికి సిగ్గుండాలని కాంగ్రెస్‌ నేత గజ్జెల కాంతం మండిపడ్డారు. కవిత ఏమైనా దేశం కోసం త్యాగం చేసి జైలుకెళ్లిందా.. అంటూ బీఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. ‘

Updated Date - Aug 29 , 2024 | 03:57 AM