Share News

HYDRA: కబ్జాలపై చర్యలు ఖాయం..

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:14 AM

చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కార్యాచరణలో దూకుడు మరింత పెరిగింది.

HYDRA: కబ్జాలపై చర్యలు ఖాయం..

  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టీకరణ

  • పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, ఖానామెట్‌లో

  • సుడిగాలి పర్యటన.. చెరువుల పరిశీలన

  • ఈదులకుంట అదృశ్యంపై ఆశ్చర్యం

  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ .. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, ఖానామెట్‌లో పర్యటన.. చెరువుల పరిశీలన

  • స్థానికుల ఫిర్యాదులతో కబ్జాలపై దర్యాప్తు

  • క్షేత్రస్థాయిలో చెరువుల విస్తీర్ణంపై విచారణ

పటాన్‌చెరు/మియాపూర్‌/మోతీనగర్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కార్యాచరణలో దూకుడు మరింత పెరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. ఫిర్యాదులు వచ్చిన చెరువుల వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించేందుకు తన బృందంతో కలిసి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, అమీన్‌పూర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌ ఖానామెట్‌, అల్లాపూర్‌లోని చెరువుల వద్దకు వెళ్లారు.


పటాన్‌చెరులోని సాకి చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణల్ని పరిశీలించారు. చెరువును ఆనుకొని ఉండే శాంతినగర్‌ కాలనీలోని నిర్మాణాలను పరిశీలించారు. చెరువు విస్తీర్ణాన్ని దాటి..వచ్చిన నిర్మాణాలను గుర్తించాలని ఇరిగేషన్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. సాకి చెరువు విస్తీర్ణం ఎగువన ఇక్రిశాట్‌లో ఉన్న చెరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ బీరంగూడలోని శంభునికుంటను హైడ్రా కమిషనర్‌ సందర్శించారు. చెరువు విస్తీర్ణం, ఆక్రమణలను గుర్తించి రూపొందించిన స్కెచ్‌ మ్యాప్‌లోని వివరాలను ఇరిగేషన్‌ డీఈ రామస్వామి ద్వారా ఆరా తీశారు.


శంభునికుంట ఆక్రమణలపై గతంలో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాలని, కుంట పరిధిలోని కట్టడాలను గుర్తించి నోటీసులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అమీన్‌పూర్‌ గ్రామ శివారులోని సంభి చెరువును పరిశీలించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, జరిగిన ఆక్రమణపై నివేదిక ఇవ్వాలన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని మొత్తం చెరువులు, కుంటల పరిధిలో జరిగిన ఆక్రమణలు, గొలుసుకట్టు కాల్వలను పూడ్చి నిర్మించిన ఇళ్ల వివరాలతో నివేదిక సిద్ధం చేసి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.


  • వెంకటరమణ కాలనీలో కదులుతున్న డొంక

అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని వెంకటరమణ కాలనీ లేఅవుట్‌లో వదిలిన పార్కును, పాఠశాల స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దర్యాప్తు ప్రారంభించడంతో అక్రమాల డొంక కదిలింది. 1985లో సర్వే నంబర్‌ 151, 152లో అప్పటి హుడా అనుమతితో సుమారు 15 ఎకరాల్లో వెంకటరమణ కాలనీ మునోత్‌ ప్రైవేట్‌ ట్రస్ట్‌ పేరుతో లేఅవుట్‌ వేసి ప్లాట్లను విక్రయించారు. మొత్తం 144 ప్లాట్లను కొందరు కొనుగోలు చేశారు. తరువాత ప్లాట్ల యజమానులకు తెలియకుండా లేఅవుట్‌ స్థలాన్ని ఇండియన్‌ బ్యాంక్‌లో తనఖా పెట్టి పెద్దఎత్తున రుణాలు పొందారు. దీంతో వివాదం ఏర్పడి 40 ఏళ్లుగా కోర్టులో తగాదా నడుస్తోంది. న్యాయం కోసం ప్లాట్ల యజమానులు నేటి వరకు పోరాడుతూనే ఉన్నారు. 2021లో ప్లాట్ల యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది.


అయితే భూ మాఫియా కన్ను కాలనీలోని ఖాళీ స్థలాలు, పార్కు స్థలాలపై పడింది. ఈ క్రమంలో ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రావడం, లేఅవుట్‌లోని స్థలాలు ఇంకా మునోత్‌ ప్రైవేట్‌ ట్రస్ట్‌ పేరు మీదే ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. ట్రస్ట్‌ యజమాని జైన్‌ వారసులు.. భూములను కొందరికి విక్రయించారు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధి సోదరుడు కీలకపాత్ర పోషించి సుమారు రూ.100 కోట్ల విలువైన 12 వేల గజాల స్థలాన్ని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం వివాదాస్పదంగా మారింది.


కాలనీలో పార్కు, పాఠశాల కోసం వదిలిన స్థలంతోపాటు అనేక ప్లాట్లను కబ్జా చేసి డాక్యుమెంట్లను సృష్టించి అడ్డదారిలో హెచ్‌ఎండీఏ అనుమతులు పొందినట్లు తెలిసింది. ‘గోల్డెన్‌ కీ’ పేరుతో భారీ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తూ అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై అధికారుల వద్దకు పలుమార్లు తిరిగిన ప్లాట్ల యజమానులు.. లేవుట్‌ సర్వే చేసి హద్దులు నిర్ణయించాలంటూ సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ‘గోల్డెన్‌ కీ’ నిర్మాణదారులు, కొందరు ప్రజాప్రతినిధులు సర్వే చేయకుండా అడ్డుకున్నారు.


  • పారదర్శకంగా సర్వే చేసి నిజాలు నిగ్గు తేలుస్తాం: రంగనాథ్‌

వెంకటరమణ కాలనీ పార్కు స్థలాల కబ్జా వ్యవహారాన్ని త్వరలోనే తేల్చేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్లాట్ల యజమానులకు హామీ ఇచ్చారు. శనివారం లేఅవుట్‌ను పరిశీంచి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మునోత్‌ జైన్‌ ట్రస్ట్‌ భూముల వివాదాన్నీ త్వరలోనే తేల్చేస్తామన్నారు. త్వరలోనే డీఈ సర్వేను పూర్తి చేస్తామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు చేపడతామని అన్నారు. సర్వేకు అడ్డంకులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.


ఇదిలా ఉండగా.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను ఇరిగేషన్‌ శాఖ అధికారులు తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీరంగూడలోని శంభునికుంటలో కబ్జాలు చేసి సుమారు రెండు ఎకరాల స్థలం చుట్టూ రేకుల ఫెన్సింగ్‌ వేసిన ఆక్రమణల్ని ఇరిగేషన్‌ డీఈ రామస్వామి చూపించలేదని స్థానికులు అంటున్నారు. కేవలం రోడ్డుపై నుంచి కమిషనర్‌ దృష్టి మళ్లించేందుకు వేరే వైపు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కబ్జాలను చూపించకుండా ఎప్పుడో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చామంటున్నారని తప్పుబడుతున్నారు. ఎవరికి కొమ్ము కాసేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారి ఇలా వ్యవహరించారని ప్రశ్నిస్తున్నారు.


  • సున్నం చెరువును పరిశీలన..

అల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని సున్నం చెరువు ప్రాంతాన్ని కూడా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శనివారం పరిశీలించారు. సున్నం చెరువుతోపాటు చెరువు అనుబంధ కాలువలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురికావడంపై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రంగనాథ్‌ దీనిని సందర్శించారు. చెరువు ఆక్రములపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.


  • ఖానామెట్‌లో ఈదులకుంట మాయం..!

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని మాదాపూర్‌ ఖానామెట్‌ గ్రామంలో కబ్జాకు గురైన ఈదులకుంటను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా.. కుంటలోని కొంత భూమిని కొందరు తమ పేరిట పట్టా చేయించుకున్నారు. దానిని చదును చేసి.. త్వరలో భవన నిర్మాణాలు చేపట్టేందుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్‌ రంగనాథ్‌ శనివారం ఈదులకుంటను సందర్శించారు. పేరులో మాత్రమే ఉన్న కుంట వాస్తవంగా కనిపించకపోవడంతో ఆయన అవాక్కయ్యారు.


చెరువుకు సంబంధించి పూర్తి వివరాలు సిద్ధం చేయాలని, ఆక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కాగా, ఖానామెట్‌ సర్వే నంబర్‌ 7లో 6.05 ఎకరాల సర్కారు భూమి ఉంది. 1954-55 పహాణి నుంచి నేటి ధరణి రికార్డుల వరకు కూడా చెరువు ప్రభుత్వ భూమి అనే ఉంది. తమ్మిడికుంట నుంచి నాలా ఈదులకుంటలోకి వస్తుంది. కానీ, కబ్జాదారులు ఈ నాలాను అక్రమంగా దారి మళ్లించారు. చెరువులోకి నీరు రాకుండా చేశారు. సర్వే నంబర్‌ 5లో 1.34 ఎకరాలు, సర్వే నంబర్‌ 8లో 1.08 గుంటలు, సర్వే నంబర్‌ 6లో 18 గుంటల భూమిని తమ పేరిట పట్టా చేయించుకున్నారు. అయితే ఈ మొత్తం భూమి కూడా ఈదులకుంట చెరువు పరిధిలోకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామ రెవెన్యూ మ్యాప్‌ కూడా సదరు నంబర్లలో ఈదులకుంట చెరువు ఉన్నట్లు చూపిస్తోంది. ఈ చెరువు గత కొన్నేళ్ల నుంచి కనుమరుగైంది.

Updated Date - Sep 01 , 2024 | 03:14 AM