ICICI Bank: రూ.10వేల కోట్లు వచ్చినయ్!
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:35 AM
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ)కు ఐసీఐసీఐ బ్యాంకు రూ.10వేల కోట్ల అప్పును మంజూరు చేసింది.
టీజీఐఐసీకి రుణం ఇచ్చిన ఐసీఐసీఐ
సంస్థ ఖాతాలో జమ అయిన సొమ్ము
400 ఎకరాల తనఖాతో రుణ సేకరణ
10 ఏళ్లలో తిరిగి చెల్లించనున్న టీజీఐఐసీ
ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా రుణం
పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కార్
రైతు భరోసా, రైతు కూలీలకు 12వేల భృతికి ఈ నిధులను వినియోగించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ)కు ఐసీఐసీఐ బ్యాంకు రూ.10వేల కోట్ల అప్పును మంజూరు చేసింది. ఈ మేరకు రుణం తాలూకు సొమ్ము ఇటీవలే టీజీఐఐసీ బ్యాంకు ఖాతాలో పడినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టీజీఐఐసీ నుంచి ఈ నిధులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాక.. సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12వేల భృతి పథకాలకు వినియోగించవచ్చని తెలుస్తోంది. వడ్డీతో కలిపి మొత్తం రుణాన్ని సొంతంగా చెల్లిస్తానన్న షరతుతో టీజీఐఐసీ ఈ రుణాన్ని తీసుకుంది. ఇందుకోసం 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి టీజీఐఐసీకి బదిలీ చేస్తూ జూన్ 26న జీవో 54ను జారీ చేసింది.
కోకాపేట పరిసర గ్రామాల్లో నిర్వహించిన వేలం పాటలో పలికిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఎకరాకు రూ.75 కోట్లుగా రేటును నిర్ణయించింది. ఈ భూమిని ఐటీ పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం వినియోగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే భూమిని బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.10వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు టీజీఐఐసీ.. బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. కరూర్ వైశ్యా బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులురుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు వార్షిక వడ్డీ(9.6 శాతం) తక్కువగా ఉండడంతో ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి టీజీఐఐసీ సిద్ధమైంది. ఈ మేరకు బ్యాంకుతో ఒప్పందం కూడా పూర్తయింది. దీని ప్రకారం నెలాఖరులోగా అప్పు అందాల్సి ఉంది. అన్నట్లుగానే... ఐసీఐసీఐ నుంచి టీజీఐఐసీకి రుణం సొమ్ము అందింది.
టీజీఐఐసీ ద్వారానే తిరిగి చెల్లింపు...
ప్రస్తుతం తీసుకున్న రూ.10వేల కోట్ల అప్పును తిరిగి టీజీఐఐసీ సొంతంగా చెల్లిస్తుందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400ఎకరాల భూమిని టీజీఐఐసీకి కేటాయించింది. ఎకరాకు రూ.75కోట్ల చొప్పున మొత్తం రూ.30వేల కోట్ల విలువైన భూముల్ని బదిలీ చేసింది. అంటే ప్రభుత్వం ఒక రకంగా ఆ భూమిని టీజీఐఐసీకి అమ్మేసినట్లే. దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించే ప్రక్రియలో భాగంగా టీజీఐఐసీ రూ.10వేల కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ మొత్తాన్ని కొన్ని రోజుల్లోనే ప్రభుత్వానికి బదిలీ చేయనుంది. అయితే, ప్రభుత్వమే ఈ భూమిని నేరుగా కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకునే అవకాశం ఉన్నా.. అలా చేస్తే ఆ రుణం కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వస్తుంది. అదేజరిగితే.. ఇతరమార్గాల నుంచి ప్రభుత్వం తీసుకునే రుణాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆ భూములను టీజీఐఐసీకి బదలాయించి, ఆ సంస్థ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.