‘స్టాన్‌ఫర్డ్’ నేత్ర వైద్య పరిశోధకుల జాబితాలో... వైద్యులు గుళ్లపల్లి, సంతోష్‌కుఅగ్రస్థానం
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:58 AM
నేత్ర వైద్య రంగానికి అత్యుత్తమ సేవలందించిన పరిశోధకులతో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన జాబితాలో హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు, ‘సెంటర్ ఫర్ సైట్’ కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సంతోష్ జీ హొనావర్ భారతదేశంలో అగ్రగాములుగా నిలిచారు.
జీవితకాల సేవల విభాగంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్‌కు గుర్తింపు
ప్రపంచంలోని రెండు శాతం అగ్రశ్రేణి నేత్ర వైద్య పరిశోధకుల్లో 55 మంది భారతీయులే
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నేత్ర వైద్య రంగానికి అత్యుత్తమ సేవలందించిన పరిశోధకులతో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన జాబితాలో హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు, ‘సెంటర్ ఫర్ సైట్’ కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సంతోష్ జీ హొనావర్ భారతదేశంలో అగ్రగాములుగా నిలిచారు. నేత్ర వైద్య రంగంలో గత ఏడాది చేసిన కృషి, దాని ఫలితాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఎల్స్‌వియర్ సంస్థ నిపుణుల బృందం ప్రకటించింది.
జీవితకాలం ప్రభావవంతమైన సేవలు అందించిన వారి విభాగంలో డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్, రిఫ్రాక్టివ్ సర్జరీ’.. ఆయన పేరును ‘ఆఫ్తాల్మాలజీ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చింది. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారం అందజేసింది.
డాక్టర్ సంతోష్ జీ హొనావర్... వరుసగా నాలుగోసారి దేశంలోని నేత్ర వైద్య పరిశోధకుల్లో అగ్రగామిగా నిలిచారు. ఆయన ‘సెంటర్ ఫర్ సైట్’ కంటి ఆస్పత్రిలో ఆఫ్తాల్మిక్ ప్లాస్టిక్ సర్జరీ, ఆక్యులర్ ఆంకాలజీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆల్ ఇండియా ఆఫ్తాల్మాజికల్ సొసైటీ (ఏఐవోఎస్) గౌరవ కార్యదర్శిగా కూడా సేవలందిస్తున్నారు. భారత ఉప ఖండం నుంచి బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక ‘రాయల్ కాలేజీ ఆఫ్ ఆఫ్తాల్మాలజిస్ట్స్’ ఫెలోషిప్ అందుకున్న ఏకైక వైద్యుడు. ఆయన ‘స్టాన్‌ఫర్డ్’ పరిశోధకుల జాబితాలో ప్రథమ స్థానంతో పాటు నేత్ర వైద్య రంగానికి జీవితకాల సేవల విభాగంలో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచంలో అగ్రగాములుగా ఉన్న 2 శాతం మంది నైత్ర వైద్య పరిశోధకులతో ‘స్టాన్‌ఫర్డ్’ ఈ జాబితాను రూపొందించగా.. ఇందులో 55 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు.