Hyderabad: అనుమతుల్లేకుండానే ఆస్పత్రులు!
ABN , Publish Date - Jun 22 , 2024 | 05:10 AM
ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా.. తొలుత స్థానికంగా ఉండే ఆస్పత్రులు లేదా క్లినిక్‌ల్లో చూపించుకోవడానికే ప్రజలు ప్రాధాన్యం ఇస్తుంటారు. స్థానికంగా అందుబాటులో ఉండడం, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తుండడమే.. దీనికి కారణం.
హైదరాబాద్‌లో సగానికిపైగా ఇలాంటివే..
చాలా నర్సింగ్ హోమ్‌ల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థే లేదు
తాత్కాలిక అనుమతులతోనే నెట్టుకొస్తున్న వైనం
నిపుణులైన వైద్యులు, సిబ్బంది లేకున్నా చికిత్సలు
వైద్య అధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు
హైదరాబాద్ సిటీ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా.. తొలుత స్థానికంగా ఉండే ఆస్పత్రులు లేదా క్లినిక్‌ల్లో చూపించుకోవడానికే ప్రజలు ప్రాధాన్యం ఇస్తుంటారు. స్థానికంగా అందుబాటులో ఉండడం, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తుండడమే.. దీనికి కారణం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు వేలల్లోనే ఉన్నాయి. కానీ, వీటిలో చాలా వరకు అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయని తనిఖీల్లో తేలింది. హైదరాబాద్ పరిధిలో 10 నుంచి 250 పడకలు ఉన్న ఆస్పత్రులు 6వేల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 3వేల వరకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఉండగా, చిన్నపాటి క్లినిక్‌లు కూడా వేలల్లోనే ఉన్నాయి. ఈ మేరకు అసలు అనుమతులు ఉన్నవి ఎన్ని? లేనివి ఎన్ని? అనే లెక్కలు తీసే పనిలో వైద్యాధికారులు ఉన్నారు. ప్రత్యేక బృందాలు కొన్ని రోజులుగా వివరాలు సేకరిస్తున్నాయి. అయితే, ఇప్పటిదాకా చేపట్టిన తనిఖీల్లో నే విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే దాదాపు 400పైగా ఆస్పత్రులకు అనుమతులు లేనట్లు తేలింది. అధిక శాతం ఆస్పత్రులు తాత్కాలిక అనుమతి తీసుకుని వాటితోనే నెట్టుకొస్తున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు అయిదేళ్ల వరకు అనుమతి తీసుకుని, ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. మెజారిటీ నర్సింగ్‌హోమ్‌లు నిబంధనలకు విరుద్ధం కొనసాగుతున్నాయి. 3వేల నర్సింగ్‌హోమ్‌లకు గాను 800లోపు మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. చాలా నర్సింగ్ హోమ్‌ల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థే లేదు. ఆస్పత్రుల్లో ఎక్కడా నిబంధనలకు అనుగుణంగా ఫర్నిచర్, పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉండడం లేదు. చాలా చోట్ల నిపుణులైన వైద్యులు కూడా లేరు. అనుమతి లేని వైద్యులు సైతం ఇష్టానుసారం చికిత్సలు చేస్త్తున్నారు. వాస్తవానికి జీవో నంబర్ 135 ప్రకారం ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌ల నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. ఆస్పత్రిలో అన్ని వసతులు సమకూర్చుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌వో) కార్యాలయంలో అనుమతి పొందాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రి, నర్సింగ్ హోమ్‌లకు 90 రోజుల పాటు తాత్కాలిక అనుమతి ఇస్తారు. డీఎంహెచ్‌వో తనిఖీల సందర్భంగా ఆస్పత్రి భవనానికి జీహెచ్‌ఎంసీ పర్మిషన్ ఉందా? లేదా? అగ్నిమాపక దళం నుంచి అనుమతి ఉందా? అద్దె భవనం అయితే లీజు పత్రాలు, కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి తదితర అంశాలను పరిశీలించిన తర్వాత అన్ని బాగున్నాయని అనుకుంటే పూర్తి స్థాయి అనుమతి లభిస్తుంది. ఒక వేళ అధికారులు అనుమతి ఇస్తే తొలుత ఐదు నెలలకే ఇస్తారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత స్థానిక యుపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ప్రతి మూడు నెలలకు ఒక సారి పరిశీలిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక దళ అనుమతి సర్టిఫికెట్ ఉందా? లేదా? అని పరిశీలిస్తున్నారే తప్ప...ఆస్పత్రుల్లో వాటిని ఏర్పాటు చేశారా? లేదా? అని చూడడం లేదు. ఫలితంగా తాత్కాలిక అనుమతులతోనే ఏళ్లపాటు ఆస్పత్రులు కొనసాగుతున్నాయి.