Narsimha Reddy: ‘వైటీపీఎస్’ పనుల అప్పగింతలో అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం
ABN , Publish Date - Jun 02 , 2024 | 02:45 AM
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) నిర్మాణ పనుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగిస్తానని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. విచారణ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన శనివారం దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో వైటీపీఎ్‌సను పరిశీలించారు.
ప్లాంట్‌ను పరిశీలించిన కమిటీ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి
దామరచర్ల, జూన్ 1: నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) నిర్మాణ పనుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగిస్తానని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. విచారణ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన శనివారం దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో వైటీపీఎ్‌సను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. టెండర్లు పిలవకుండానే కాంట్రాక్టు పనులను అప్పగించారనే అభియోగంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
దీనిపై అప్పటి అధికారులను సమాధానం చెప్పాలని కోరినట్లు తెలిపారు. అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరామన్నారు. వివిధ సంస్థలకు చెందిన పలువురు ముందుకు వచ్చారని, వారి నుంచి త్వరలో వివరాలు సేకరిస్తామని పేర్కొన్నారు. పూర్తి విచారణ నివేదికను మూడు నెలల్లో ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. వైటీపీఎ్‌సలోని మొదటి యూనిట్ ఆగస్టు నెలలో, రెండో యూనిట్ సెప్టెంబరులో, ఆరు నెలల తర్వాత మిగిలిన యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారని ఆయన చెప్పారు.