Sridhar Babu: ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు
ABN , Publish Date - Dec 19 , 2024 | 03:11 AM
అమెరికాలో ఐటీ కంపెనీల అతిపెద్ద సంఘంగా ఉన్న ఐటీ సర్వ్ అలయన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సహకారం అందించనుంది.
తొలి విడతలో ఐదు జిల్లాల్లో కంపెనీల ఏర్పాటు
ఐటీసర్వ్ అలయన్స్‌తో ప్రభుత్వం భారీ ఒప్పందం
రాష్ట్ర ఐటీ ముఖ చిత్రమే మారిపోయే నిర్ణయమిది
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఐటీ కంపెనీల అతిపెద్ద సంఘంగా ఉన్న ఐటీ సర్వ్ అలయన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సహకారం అందించనుంది. దీనికి సంబంధించిన ఒప్పంద కార్యక్రమం బుధవారం సచివాలయంలో జరిగింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ సర్వ్ అలయన్స్ జాతీయ అధ్యక్షుడు జగదీశ్ మోసాలి పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తారు. తొలి విడతలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ కంపెనీల విస్తరణతోపాటు అక్కడ స్థానికులకు కావాల్సిన నైపుణ్య శిక్షణను అందిస్తారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ కార్యక్రమాలు చేపడతారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న సానుకూలతలు, ప్రయోజనాలపై సభ్య కంపెనీల్లో అవగాహన కల్పించేందుకు ఐటీ సర్వ్ అలయన్స్ ఽప్రధానంగా దృష్టి పెడుతుందని ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జగదీశ్ మోసాలి తెలిపారు. ఐటీని జిల్లాలకూ విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఐటీని జిల్లాలకు విస్తరించాలన్న తమ లక్ష్యానికి అనుకూలంగా ఈ ఒప్పందం కీలక అడుగు అన్నారు. ద్వీతియశ్రేణి నగరాల్లో 30వేలకు పైగా ఐటి ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని, దీంతో రాష్ట్ర ఐటి ముఖచిత్రమే మారుపోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.