Hiriya Naik: సంగారెడ్డి జైలు ఘటనలో కుట్ర కోణం
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:51 AM
సంగారెడ్డి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ‘లగచర్ల’ రైతు హీర్యా నాయక్ అస్వస్థతకు గురైతే సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించిన ఘటనపై జైళ్ల శాఖ విచారణ చేపట్టింది.
సీసీ కెమెరా, ఫోన్ రికార్డింగుల పరిశీలన
ఎస్కార్టు కోరుతూ రాసిన లేఖలో పొందుపర్చిన అంశాలపై కుదరని పొంతన
నిజాలు నిగ్గుతేల్చే పనిలో జైళ్ల శాఖ
విచారణాధికారిగా సీనియర్ ఐజీ
సోమవారం పూర్తిస్థాయి నివేదిక?
జైలు సూపరింటెండెంట్‌పై వేటుపడే చాన్స్
హైదరాబాద్, సంగారెడ్డి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ‘లగచర్ల’ రైతు హీర్యా నాయక్ అస్వస్థతకు గురైతే సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించిన ఘటనపై జైళ్ల శాఖ విచారణ చేపట్టింది. నిందితుడికి అసలు ఏ మాత్రం సంబంధం లేని బాలానగర్ కేసులో నిందితుడిగా ఎందుకు పేర్కొనాల్సి వచ్చింది? దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో జైళ్ల శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం విషయాలు నిగ్గు తేల్చేందుకు సీనియర్ ఐజీని విచారణాధికారిగా జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా నియమించారు. ఆయన శుక్రవారం ఉదయం సంగారెడ్డి జైలుకు వెళ్లి విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డులు పరిశీలించడంతోపాటు అధికారులు, సిబ్బందిని విచారించి డీజీకి ప్రాథమిక నివేదిక అందజేశారు. విచారణలో సేకరించిన మొత్తం వివరాలను క్రోడీకరించి సమగ్ర నివేదికను సోమవారం డీజీకి అందించనున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే జైలర్ సస్పెండ్ కాగా సూపరింటెండెంట్ సంతోష్ రాయ్‌ని బాధ్యతల నుంచి తప్పించారు. నివేదిక ఆధారంగా మరికొంత మంది అధికారులు, సిబ్బందిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపరింటెండెంట్‌పై చర్యలకు జైళ్ల శాఖ డీజీ ఇదివరకే హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి సిఫారసు చేశారు.
ఐజీ అందించే నివేదిక మేరకు సూపరింటెండెంట్‌పై హోంశాఖ తగు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సూపరింటెండెంట్‌పైనా వేటు పడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. లగచర్ల కేసులో విచారణ ఖైదీగా ఉన్న వ్యక్తిని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చాల్సి వచ్చిందనేదానిపైనే జైళ్ల శాఖ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. అనుకోకుండా తప్పిదం దొర్లిందని జైలు అధికారులు చెబుతున్నప్పటికీ వారు చెప్పే అంశం అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో అధికారులు విచారణ జరుపుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం అనారోగ్యంతో బాధపడే ఖైదీలకు స్థానిక ఏఆర్ సిబ్బంది ఎస్కార్టుతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. కేవలం కోర్టు విచారణల సమయంలో మాత్రమే కేసు ఎక్కడ నమోదైతే ఆక్కడి ఏఆర్ సిబ్బంది ఎస్కార్టు కోరాల్సి ఉంటుంది. సాధారణంగా అన్ని జైళ్లల్లో జరిగేది ఇదే. కానీ ఇక్కడ వికారాబాద్ జిల్లాలో నమోదైన కేసులో అక్కడి సిబ్బందిని ఎస్కార్టు అడగకుండా... పైగా సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏ మాత్రం సంబంధం లేని కేసులో నిందితుడిగా చూపించి పంపడంపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
జైలు అధికారులు తప్పిదం జరిగిందంటూ చెబుతున్న సమాధానం విశ్వసనీయంగా లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో కుట్ర దాగి ఉందా అనేది విచారణలో నిగ్గు తేలుతుందన్నారు. అసలు హీర్యా నాయక్‌కు జైల్లోని ఆస్పత్రిలో అందించిన చికిత్స ఏమిటి? ఈ కేసులో మరో నిందితుడు ఫోన్‌లో మాట్లాడటం వంటి అంశాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. జైలు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు, ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నారు. ఇక ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టయిన హీర్యా నాయక్‌ను జైల్లో ములాఖత్‌లో కలిసిన వారి జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఓ వైపు జైళ్ల శాఖ, మరోవైపు నిఘా విభాగం జరుపుతున్న విచారణ అనంతరం మరికొంత మంది జైలు అధికారులు, సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది. ‘‘మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు సీనియర్ ఐజీని విచారణాధికారిగా నియమించాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.సూపరింటెండెంట్ విషయంలో చర్యలకు హోంశాఖకు లేఖ రాశాం. జైలు అధికారులు చెబుతున్న అంశాల్లో కొన్నింటిపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది.’’ అని డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు.
ఆ ఫోన్ ఎవరు చేసినట్టు?
లగచర్ల ఘటనలో ఏ-2గా ఉన్న మరో రిమాండ్ ఖైదీ సురేశ్ జైలు నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా ఎవరికి ఫోన్ చేశాడన్న అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? లేక ఏదైనా పార్టీ హస్తముందా? మరెవరైనా ప్రముఖలు ఉన్నారా? అన్న అంశం.. పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది.