Share News

Jishnu Dev Varma: గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ ప్రమాణ స్వీకారం..

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:21 AM

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Jishnu Dev Varma: గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ ప్రమాణ స్వీకారం..

  • చేయించిన హైకోర్టు సీజే అరాధే

  • హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు

  • తెలంగాణ ప్రజలకు సేవచేసే

  • అదృష్టం దక్కిందన్న కొత్త గవర్నర్‌

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యంగ్‌ అండ్‌

  • డైనమిక్‌ లీడర్‌ అంటూ ప్రశంస

  • శుభాకాంక్షలు తెలిపిన కిషన్‌రెడ్డి

  • ఘన స్వాగతం పలికిన సీఎం, సీఎస్‌

  • సుస్థిర అభివృద్ధికి సహకరించాలని కొత్త గవర్నర్‌ పిలుపు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి, జస్టిస్‌ అలోక్‌ అరాధే పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా గవర్నర్‌ను వెంట తీసుకెళ్లి మంత్రులు, ఇతర ప్రముఖుల్ని పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమం తర్వాత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు.


సీఎం, మంత్రులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఆ తర్వాత ప్రముఖులతో కలిసి గవర్నర్‌ తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి కుమారి, గవర్నర్‌ ముఖ్య సలహాదారు బుర్రా వెంకటేశం, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్‌, సీఎం ధరించిన కండువాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రమాణ స్వీకారానికి ముందు జిష్ణుదేవ్‌ వర్మను రాజ్‌భవన్‌లో కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు.


వెంటనే గవర్నర్‌ తమ సాంప్రదాయం ప్రకారం రేవంత్‌ రెడ్డికి కండువా కప్పారు. సాధారణంగా సీఎంకు ఎవరైనా శాలువా, కండువా కప్పితే భద్రతా సిబ్బంది వెంటనే తీసేస్తారు. కానీ, ఇది తమ సంప్రదాయమని గవర్నర్‌ చెప్పడం, ఆయన కూడా ధరించి ఉండటంతో.. సీఎం కూడా కండువా ధరించే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్‌ ఫొటోలోనూ కండువాతోనే కనిపించారు. అంతకుముందు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయలో జిష్ణుదేవ్‌ వర్మకు సీఎం రేవంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. సీఎ్‌సతోపాటు డీజీపీ జితేందర్‌, త్రివిద దళాల అధికారులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.


  • యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సీఎం రేవంత్‌రెడ్డి

గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిష్ణుదేవ్‌ వర్మ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. సమ్మిళిత, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో తెలంగాణ పౌరులంతా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘‘విభిన్న సంస్కృతులు, సుసంపన్న వారసత్వం, ప్రకృతి అందాలకు నిలయం తెలంగాణ. ఇక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన సారథ్యంలోని మంత్రి వర్గానికి అభినందనలు. యువత సమాజానికి గొప్ప ఆస్తి. నాణ్యమైన విద్య, ఉపాధి అకాశాలు అందించడం వల్ల వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’’ అని గవర్నర్‌ అన్నారు. రైతులకు రూ.2లక్షల మేర రుణాలు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.. తనకు సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 04:21 AM