Share News

Polavaram Project: పోలవరం ముంపుపై తక్షణమే సంయుక్త సర్వే

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:50 AM

పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ

Polavaram Project: పోలవరం ముంపుపై తక్షణమే సంయుక్త సర్వే

  • ముంపు ప్రాంతాలను వెంటనే గుర్తించాలి

  • ఏపీ, తెలంగాణకు సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో తక్షణమే సంయుక్త సర్వే నిర్వహించాలని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ కుశ్విందర్‌ సింగ్‌ వోహ్రా ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుతో కిన్నెరసాని, ముర్రేడువాగుకు ఏర్పడనున్న ముంపుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ఇప్పటికే సంయుక్త సర్వే జరిగినా ముంపు ప్రాంతాలను గుర్తించలేదు. దీనిపై రెండు రాష్ట్రాలతో తక్షణమే సంయుక్త సర్వే చేపట్టి, డీ మార్కింగ్‌ చేసే ప్రక్రియను సైతం పూర్తి చేయాలని నిర్దేశించారు.


పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రభావంపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై బుధవారం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో వోహ్రా అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. కమిటీలో సభ్యులైన ఆంధ్రపదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు సంయుక్త సర్వేకు ఏపీ ప్రభుత్వం రావడం లేదని తెలంగాణ అధికారులు తెలియజేశారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి పురోగతి లేదని, అవి కాగితాలకే పరిమితమయ్యాయన్నారు.


150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తెలంగాణలో 950 ఎకరాలకు ముంపు ఉంటుందని, దీనిపై జాయింట్‌ సర్వే చేయాల్సిందేనని కోరారు. దీనికి తెలంగాణ సహకరించడం లేదని, రెండు వాగులకే సర్వే పరిమితం చేయాల్సి ఉండగా, ఏడు వాగుల ముంపుపై సర్వే చేయాలని కోరుతోందని ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరావు బదులిచ్చారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోహ్రా స్పందిస్తూ తెలంగాణ విజ్ఞప్తి మేరకు సంయుక్త సర్వే చేయాల్సిందేనని సూచించారు.


దీన్ని సమన్వయం చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఆదేశించారు. 150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌ మేరకు పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేసినప్పుడు ఉండే ముంపుతో పాటు ప్రాజెక్టు వల్ల ముర్రెడువాగు, కిన్నెరసాని వాగులకు ముంపును గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. తెలంగాణ కోరిన మేరకు మిగిలిన 5 వాగులకు పోలవరం ప్రాజెక్టు వల్ల ఉన్న ముంపుపై సంయుక్త సర్వే విషయంలో మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుందామన్నారు. సీడబ్ల్యూసీ సర్వేలో తేలిన దానికి మించి తమ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉందని ఒడిశా అధికారి అశుతోష్‌ దాస్‌ పేర్కొనగా.. తదుపరి సమావేశంలో చర్చిస్తామని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Aug 29 , 2024 | 04:50 AM