Share News

Power Scams: ‘విద్యుత్తు’ నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే!

ABN , Publish Date - Oct 31 , 2024 | 03:58 AM

విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్కేంద్రాలను నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగించడం వంటి నిర్ణయాలన్నీ మాజీ సీఎం కేసీఆరే తీసుకున్నారని జ్యుడీషియల్‌ కమిషన్‌ నిర్ధారించింది.

Power Scams: ‘విద్యుత్తు’ నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే!

  • ప్రభుత్వానికి జ్యుడీషియల్‌ కమిషన్‌ నివేదిక

  • కేసీఆర్‌ను విచారణకు పిలవకుండా ఆయన లేఖలోని అంశాలనే అభిప్రాయాలుగా తీసుకున్న కమిషన్‌

  • గడువులోపే నివేదిక సమర్పణ!

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్కేంద్రాలను నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగించడం వంటి నిర్ణయాలన్నీ మాజీ సీఎం కేసీఆరే తీసుకున్నారని జ్యుడీషియల్‌ కమిషన్‌ నిర్ధారించింది. ‘విద్యుత్తు’ అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్‌ ఈ మేరకు నివేదికను సమర్పించినట్లు తెలిసింది. కమిషన్‌ నివేదికలో కేసీఆర్‌ పాత్రను ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నెల 29తో జస్టిస్‌ లోకూర్‌ కమిషన్‌ గడువు ముగిసింది. గడువులోపే ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు తెలిసింది.


జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో కేసీఆర్‌ రాసిన లేఖతోనే విచారణపై ఏకాభిప్రాయానికి వచ్చి నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. కేసీఆర్‌ న్యాయపోరాటం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అనంతరం కమిషన్‌ బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ లోకూర్‌.. విచారణ పత్రాలన్నింటినీ పరిశీలించారు. మరోవైపు విచారణ ప్రక్రియ నుంచి తప్పుకోవడానికి ముందే ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్‌దే కీలక పాత్ర అని, ఆయన నిర్ణయాల వల్లే విద్యుత్తు రంగం దెబ్బతిన్నదని జస్టిస్‌ నర్సింహారెడ్డి నిర్ధారణకు వచ్చారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వగా.. ఆయన లిఖితపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు పిలవరాదని జస్టిస్‌ లోకూర్‌ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దాంతో కేసీఆర్‌ రాసిన లేఖలోని అంశాలనే అభిప్రాయాలుగా తీసుకొని, నివేదికను రూపొందించినట్లు తెలిసింది.


  • మలుపులు తిరుగుతూ..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్తు రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఛత్తీ్‌సగఢ్‌తో జరిగిన విద్యుత్తు ఒప్పందంలో తప్పిదాలేంటి? 2000 మెగావాట్ల కోసం కారిడార్‌ను బుక్‌ చేసుకొని, ఆ మేరకు కరెంట్‌ తీసుకోకుండా పవర్‌ గ్రిడ్‌కు జరిమానాల రూపంలో కట్టినదెంత? పిట్‌హెడ్‌ విధానంలో కాకుండా సుదూరంలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న కారణంగా దీర్ఘకాలంగా తెలంగాణ ప్రజలపై ఏ మేరకు భారం పడనుంది? కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం వల్ల కలిగిన నష్టమేంటి? ఈ ఒప్పందంలో ఏ మేరకు తప్పిదాలు జరిగాయి? నామినేషన్‌ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించడం వల్ల జరిగిన నష్టాలేంటి? వంటి అంశాలపై విచారణ కోసం గత మార్చి 14న జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసింది. విచారణ ప్రక్రియ పలు కీలక దశలు దాటి.. నివేదిక ఇస్తారనే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుతో జస్టిస్‌ నర్సింహారెడ్డి విచారణ ప్రక్రియ నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత గత జూలై 29నజస్టిస్‌ లోకూర్‌ నేతృత్వంలో కమిషన్‌ వేసి.. 3 నెలల్లో (అక్టోబరు 29కల్లా) నివేదికను ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Oct 31 , 2024 | 03:58 AM