Junior Doctors: మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలి
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:37 AM
రాష్ట్ర సర్కారీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులకు పటిష్ఠమైన రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (జూడా) నాయకులు కోరారు.
మహిళా కమిషన్‌కు టీ-జూడా నేతల వినతి
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సర్కారీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులకు పటిష్ఠమైన రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (జూడా) నాయకులు కోరారు. ఆదివారం టీ- జూడా ప్రతినిధి డాక్టర్ చంద్రిక ఆధ్వర్యంలో గాంధీ, ఉస్మానియాకళాశాలల మహిళా ప్రతినిధులతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎన్.శారదను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆసుపత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లు, మెడికోలు ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించారు. వైద్యుల పని ప్రదేశంలో వారి భద్రతాపరమైన సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఆసుపత్రుల్లో మహిళలకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతో కూడిన ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో మహిళా కానిస్టేబుళ్లు విధిగా ఉండాలని కోరారు.
ఆసుపత్రుల్లోకి ప్రవేశించే రోగుల సహాయకులందరినీ పరీక్షించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేయాలని అలాగే జూడా సభ్యుల భాగస్వామ్యంతో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించారని, సర్కారుకు ఇదే విషయాన్ని తెలియజేసి సమస్యల పరిష్కారానికి యత్నిస్తానని హామీ ఇచ్చారని జూడా నేతలు వెల్లడించారు