Justice PC Ghosh: కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక?
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:36 AM
‘కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక (బ్రెయిన్ చైల్డ్)నో తెలియకుండానే పదవులు అనుభవించారా? అలాగైతే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వాస్తవాలు చెప్పకుండా కొందరిని రక్షించే యత్నం చేస్తున్నారా?
ప్రాజెక్టు గురించి తెలియకుండానే పదవులు అనుభవించారా?
అలాగైతే మీరు రాజీనామా చేయాలి.. కొందరిని రక్షిస్తున్నారా?
ఈఎన్‌సీ, కార్పొరేషన్ ఎండీ హరిరామ్‌కు జస్టిస్ ఘోష్ ప్రశ్నలు
మేడిగడ్డ బ్లాక్-7 కుంగుబాటుకు కారణం ఏమిటో చెప్పలేను
రుణాల కోసం రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల తాకట్టు: అధికారి
హైదరాబాద్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక (బ్రెయిన్ చైల్డ్)నో తెలియకుండానే పదవులు అనుభవించారా? అలాగైతే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వాస్తవాలు చెప్పకుండా కొందరిని రక్షించే యత్నం చేస్తున్నారా? కంపెనీల చట్టం ప్రకారం కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఉండాలి.. మరి ఆయనెవరు?’ అంటూ కాళేశ్వరం (గజ్వేల్) ఈఎన్‌సీ, మేనేజింగ్ డైరెక్టర్ బి.హరిరామ్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం ఆయన విచారణకు హాజరవగా 90కి పైగా ప్రశ్నలు సంధించింది. కాగా, హరిరామ్ కొన్నిటికి సమాధానాలు దాటవేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్ల వివరాలను కోరగా.. రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు సమాచారం ఇవ్వలేదని బదులిచ్చారు. బ్యారేజీల వైఫల్యానికి నిర్మాణ స్థలాలు మార్చడమే కారణమా? మేడిగడ్డ బ్లాక్-7 కుంగుబాటుకు కారణమేంటి? అని ప్రశ్నించగా ‘నేనేమీ చెప్పలేను’ అని జవాబిచ్చారు.
అయితే, వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయకపోవడం? గేట్లను మ్యానువల్ ప్రకారం ఎత్తకపోవడంతో సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయని, రక్షణ వ్యవస్థలపై ప్రభావం పడిందని మీరు అఫిడవిట్‌లో పేర్కొన్నది వాస్తవమేనా అని కమిషన్ అడగ్గా ఔను అని హరిరామ్ బదులిచ్చారు. తాను ఎవరినీ రక్షించే ప్రయత్నం చేయడం లేదన్నారు. కాళేశ్వరంలో మీ పాత్ర ఏమిటి? బ్యారేజీలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని ఆరా తీయగా, మధ్య మానేరు (ప్యాకేజీ 10) నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ (ప్యాకేజీ-16) దాకా నిర్మాణ పనులను పర్యవేక్షించినట్లు తెలిపారు. 2017లో తానే డీపీఆర్ దాఖలు చేశానని హరిరామ్ చెప్పారు. మీరెందుకు చేశారు? లిఖితపూర్వక ఆదేశాలున్నాయా? అని కమిషన్ కోరింది. ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్ మౌఖిక ఆదేశాలతో డీపీఆర్ దాఖలు చేశానని పేర్కొన్నారు. కమిషన్ ప్రశ్నలకు హరిరామ్ జవాబులిలా..
కమిషన్: రామగుండం ఈఎన్‌సీ కింద ఎంత విలువైన పనులు చేశారు? బ్యారేజీ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మారింది? సీఎంల సమావేశ మినిట్స్‌లో మీరు కూడా సంతకాలు చేశారా.?
హరిరామ్: రూ.20 వేల కోట్లపైన పనులు చేశారు. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పలు సమీక్షల అనంతరం ప్రాణ హిత-చేవెళ్లలో హెడ్‌వర్క్స్‌లను మార్చారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలు ఉండగా.. తెలంగాణ సీఎంతో సమావేశం అనంతరం ముంపు లేకుండా 148 మీటర్లకు తగ్గించుకోవాలని మహారాష్ట్ర సీఎం కోరారు. చర్చల అనంతరం ప్రత్యామ్నాయాల్లో భాగంగా హెడ్‌వర్క్స్‌ల మార్పు జరిగింది. సీఎంల సమావేశ మినిట్స్‌లో నా సంతకాలపై రికార్డులను పరిశీలించి చెబుతా.
కమిషన్: కార్పొరేషన్ నుంచి తొలి రుణం దేని కోసం, ఎంత తీసుకున్నారు? మీకు ఆర్థిక నేపథ్యం ఉందా? నాలుగేళ్ల బ్యాలెన్స్ షీట్స్ ఏవీ?
హరిరామ్: 10 బ్యాంకులతో కూడిన యూబీఐ (పూర్వ ఆంధ్రా బ్యాంకు) కన్సార్షియం నుంచి లింక్-1 (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణం) కోసం తొలి రుణం తీసుకున్నాం. నాకు ఆర్థిక నేపథ్యం లేదు. 2021-22లో మాత్ర మే ఆడిట్ జరిగింది. బ్యాలెన్స్ షీట్స్ అందిస్తాం.
కమిషన్: కార్పొరేషన్ బై లాస్ ఉన్నాయా? ఎంత రుణం తీసుకున్నారు? ఆస్తులు కుదువపెట్టారా? నెలకు ఎంత కడుతున్నారు?
హరిరామ్: నిర్మాణం పూర్తయిన వెంటనే బ్యారేజీలు, టన్నెల్స్, రిజర్వాయర్లు, భూములు, పంప్‌హౌ్‌సలను తాకట్టు పెట్టేలా ఒప్పందం ఉంది. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు రూ.74,718 కోట్లు మంజూరు చేయగా.. రూ. 62,825 కోట్లు అందాయి. కాళేశ్వరం కార్పొరేషన్‌కు పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం బాధ్యతలు కూడా ఇవ్వడంతో మరో రూ.10 వేల కోట్లు తీసుకున్నాం. ఇందులో రూ.7,725 కోట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 వరకు అసలు, వడ్డీ కలిపి రూ.29,737 కోట్లు చెల్లించాం. ప్రతి నెల రూ.950 కోట్లు చెల్లిస్తున్నాం.
కమిషన్: ప్రాజెక్టు ఖర్చు-ప్రయోజన నిష్పత్తి ఎలా ఉంది? కార్పొరేషన్ వార్షిక నివేదికలను చట్టసభల ముందు ఉంచారా?
హరిరామ్: ఖర్చు-ప్రయోజన నిష్పత్తి 1:1.51గా (రూపాయి వెచ్చిస్తే.. రాబడి రూ.1.51) ఉంది. 2016-17 నుంచి 2020-21 మధ్య ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాం. వీటిని సభలో ప్రవేశపెట్టలేదు.
కమిషన్: కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? అప్పటికి బ్యారేజీలు ఏ దశలో ఉన్నాయి? సీఈవో ఎవరు? మిమ్మల్ని ఎవరు నియమించారు?
హరిరామ్: ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటికి బ్యారేజీల నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది. ఎండీగా నన్ను నీటి పారుదల శాఖ కార్యదర్శి నియమించారు.