Share News

Kaleshwaram: ‘కాళేశ్వరం’లో ఆర్థిక అవకతవకలపై నజర్‌!

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:28 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై ఇప్పటివరకు విచారణ జరిపిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌.. ఇకపై ఆర్థిక అవకతవకలపైనా దృష్టి సారించనుంది.

Kaleshwaram: ‘కాళేశ్వరం’లో ఆర్థిక అవకతవకలపై నజర్‌!

  • ఆ కోణంలో జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ విచారణ

  • పరిపాలనా అనుమతులు, అంచనాలు తదితర అంశాలపై దృష్టి

  • ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను సమకూర్చండి

  • తెలంగాణ, బెంగాల్‌తో సంబంధాల్లేని లాయర్‌ను కూడా

  • ప్రభుత్వాన్ని కోరిన కమిషన్‌

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై ఇప్పటివరకు విచారణ జరిపిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌.. ఇకపై ఆర్థిక అవకతవకలపైనా దృష్టి సారించనుంది. మూడు బ్యారేజీల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్‌ కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిలో కొందరు గత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధికి బంధువులు కూడా ఉన్నారని కమిషన్‌ గుర్తించింది. దీంతో బ్యారేజీలకు తొలుత పరిపాలనాపరమైన అనుమతి ఎంత? మధ్యలో ఎన్నిసార్లు అంచనాలను సవరించారు? వాస్తవ వ్యయం ఎంత? సబ్‌ కాంట్రాక్టర్లకు ఎంతిచ్చారు? మధ్యలో మాయమైనదెంత? అనే కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకుగాను ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)ను సమకూర్చాలని కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.


విచారణలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు వీలుగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌తో సంబంధం లేని న్యాయవాదిని కూడా సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది. ఇక విచారణ ప్రక్రియలో భాగంగా పంప్‌హౌ్‌సల నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులను గురువారం కమిషన్‌ విచారించింది. పంప్‌హౌ్‌సల నిర్మాణం వల్ల బ్యారేజీలపై ప్రభావం పడిందా? పంప్‌హౌ్‌సలను ఎవరి డిజైన్ల ప్రకారం కట్టారు? వంటి అంశాలను ఆరా తీశారు. ప్రభుత్వం అందించిన డిజైన్ల ప్రకారమే పంప్‌హౌ్‌సలు కట్టామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు వివరించారు. కమిషన్‌కు అందించిన వివరాలన్నీ పొందుపరిచి, అఫిడవిట్లు దాఖలు చేయాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులను జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌ ఫణిభూషణ్‌శర్మ కూడా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు.


మరోవైపు విద్యుత్తు రంగ నిపుణుడు కంచర్ల రఘు ఈ నెల 15న కమిషన్‌ ముందు హాజరవనున్నారు. ఆయన గత పదేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులోని లోపాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో వివరించడానికి కమిషన్‌ ఆయనకు అనుమతి ఇచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారుడు వెదిరె శ్రీరామ్‌ కూడా ఈ నెల 16న కమిషన్‌ ముందు హాజరుకానున్నారు. శుక్రవారం ప్రైవేట్‌ వ్యక్తులు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ఎత్తిచూపి.. బ్యారేజీల నిర్మాణం వద్దని వాదించి, నిర్మాణ సంస్థను వీడిన ప్రైవేట్‌ వ్యక్తి కమిషన్‌ ముందు బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వివరించనున్నారు. ఆయన ఎవరనేది శుక్రవారం హాజరైన తర్వాతే తెలియనుంది.

Updated Date - Jul 12 , 2024 | 04:28 AM