Kaleshwaram : తప్పుడు జవాబులిస్తే చర్యలు తప్పవు..
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:42 AM
‘విచారణలో దాపరికాలేమున్నాయి? పరస్పర అంగీకారంతో చర్చించాల్సిన అంశాలేంటి? మాతో వ్యవహారించాల్సిన తీరు ఇదేనా? కిందిస్థాయి సిబ్బందితో మీకు సంబంధాల్లేవా?
విచారణలో దాపరికం ఏముంది?
పరస్పర అంగీకారం ఏమిటి?
ఎవరి ఆదేశాలతో అఫిడవిట్ల దాఖలు?
నిర్మాణం పూర్తికాకుండానే
బ్యాంకు గ్యారంటీల విడుదలా?
నీటి పారుదల అధికారులపై
జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం
తప్పు జరిగింది.. క్షమించండి
అంటూ ఓ అధికారి వేడుకోలు పొరపాటు జరిగిందన్న మరో అధికారి
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘విచారణలో దాపరికాలేమున్నాయి? పరస్పర అంగీకారంతో చర్చించాల్సిన అంశాలేంటి? మాతో వ్యవహారించాల్సిన తీరు ఇదేనా? కిందిస్థాయి సిబ్బందితో మీకు సంబంధాల్లేవా? క్రికెట్ జట్టు ఓడితే కెప్టెన్ బాధ్యుడు కాడా?’ అంటూ నీటి పారుదల శాఖ అధికారులను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలతో ముంచెత్తింది. శనివారం క్వాలిటీ కంట్రోల్‌తో పాటు నిర్మాణంతో ముడిపడిన చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పూర్వ సీఈలు కలిపి 10 మందిని విచారించింది. ఐదు గంట ల పాటు క్రాస్ ఎగ్జామిషన్ చేసింది. ఓ దశలో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కమిషన్‌కు క్షమాపణలు చెప్పారు. పలువురు అధికారులు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు.
‘అఫిడవిట్‌లో పేర్కొన్న అం శాలన్నీ వాస్తవమేనా? తప్పుడు సమాధానం చెబితే మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చిక్కుల్లో పడొద్దు’ అంటూ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ పీఏ వెంకటకృష్ణను నిలదీసింది. అఫిడవిట్‌లో ‘పరస్పర అంగీకారం’ అనే పదాలు ఎందుకు వాడారు? ఏ విధం గా వాడతారు? విచారణలో దాపరికం ఏముంది? అని తీవ్రంగా మందలించగా ‘తప్పు జరిగింది.. క్షమించండి’ అంటూ వెంకటకృష్ణ బదులిచ్చారు. నిర్మాణ సమయంలో ఎన్నిసార్లు బ్యారేజీల ప్రదేశాన్ని సందర్శించారు? అని అడగ్గా, ఆ సమయంలో తాను లేనని బ దులిచ్చారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ఎవరు చేస్తా రు? వారు సర్టిఫికెట్లు ఇచ్చారా? అని కమిషన్ ప్రశ్నించగా ఈఈ స్థాయి అధికారులే వెళ్లారని, ఆ సమాచారం లేదని బదులిచ్చారు.
బాల్ వేయకముందే సిక్సర్ కొడతారా?
బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు వరంగల్ క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈగా ఎన్నిసార్లు సందర్శించారు? అని హైదరాబాద్ సీఈ కె.దేవేందర్‌రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ మధ్యంతర నివేది క తర్వాత తీసుకునే చర్యలను పరిశీలించడానికే వెళ్లానని, అంతకుముందు తాను విధుల్లో లేనని ఆయన తెలిపారు. మరికొంతసేపు మాట్లాడటానికి ప్రయత్నించగా ‘బాల్ వేయకముందే సిక్సర్ కొడతామంటే ఎట్లా? అడిగిన తర్వాతే జవాబులు చెప్పండి’ అంటూ మందలించింది. 2020-24 దాకా క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చూశారు కదా? అని ప్రశ్నించగా, ‘మీరు చెబుతున్నారు’ అనే పదాన్ని దేవేందర్‌రెడ్డి వాడారు. దీన్ని కమిషన్ తీవ్రంగా తీసుకుంది. ‘పర్యవసానాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చిక్కుల్లో పడతారు. కమిషన్‌ను ఉద్దేశించి మీరు చెబుతున్నారు అనే పదాలు వాడతారా? అనుచితంగా ప్రవర్తిస్తారా?’ ఎవరి ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేశారు? మీరు తప్పించుకోలేరు అని గట్టిగా మందలించింది.
నిర్మాణాన్ని ఎన్నిసార్లు తనిఖీ చేశారు?
బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ విభాగం పాత్ర ఏంటి? అని మాజీ చీఫ్ ఇం జనీర్ బి.వెంకటేశ్వర్లును కమిషన్ ప్రశ్నించగా ‘నాణ్యమైన కాంక్రీట్ వాడుతున్నారా లేదా?’ పరిశీలించడం వంటివి చేస్తామని బదులిచ్చారు. ఏమైనా ఉల్లంఘనలను గుర్తించారా? అని అడగ్గా పెద్దవేమీ జరుగలేదని, చిన్నచిన్నవి గుర్తించామని వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. బ్యారేజీల నిర్మాణాన్ని ఎన్నిసార్లు తనిఖీ చేశారు? అని కమిషన్ ప్రశ్నించగా, రెండు, మూడు నెలలకు ఒకసారి అని సమాధానం ఇచ్చారు. ‘పెన్ను కొంటే పనిచేస్తుందా? అని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తాం. అలాంటిది రూ.వేల కోట్లతో కట్టే బ్యారేజీ పట్ల సీఈగా మీ బాధ్యత ఇదేనా?’ అని నిలదీశారు. ఎస్‌ఈ, ఈఈలు తనిఖీ చేస్తారని వెంకటేశ్వర్లు చెప్పినా.. సీఈగా మీకు బాధ్యత లేదా’ అని ప్రశ్నలు సంధించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల క్వాలిటీ కంట్రోల్ తనిఖీల రికార్డులు ఉన్నాయా అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.రఘురామ్‌ను కమిషన్ ప్రశ్నించగా.. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్లేస్‌మెంట్ రిజిస్టర్‌లోనే వివరాలు రాస్తామని, రికార్డులన్నీ నిర్మాణ పనులు చూసే ఇంజనీర్ల వద్దే ఉంటాయని చెప్పారు. మేడిగడ్డను ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మించామని, వెంట తెచ్చుకున్న వందకు పైగా పేజీల రికార్డులను చదవబోయారు. దీంతో తమకు రెండు పేజీల అఫిడవిట్ ఇచ్చి, 100 పేజీల పైగా పుస్తకంతో వచ్చారేంటని కమిషన్ వ్యాఖ్యానించింది.
ఈఈ సర్టిఫికెట్ ఇచ్చారు.. నేను సంతకం చేశా.. మేడిగడ్డ పూర్తి కాకముందే నిర్మాణ సంస్థలకు బ్యాంకు గ్యారెంటీలను ఎందుకు చెల్లించారు? పూర్తయినట్లుగా సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు? లోపానికి బాధ్యత (డిఫెక్ట్ లయబిలిటీ) వ్యవధి ముగియకముందే ఎలా ఇస్తారు? టెండర్లను 2.7 శాతం (రూ.1,849 కోట్లకు) అధిక రేటు కోట్ చేసిన సంస్థకు అప్పగించడంలో బాధ్యులు ఎవరు?’ అని గతంలో రామగుండం డివిజన్ ఈఈగా, తర్వాత ఎస్‌ఈగా పనిచేసిన బి.వెంకటరమణారెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. ఒప్పందంలో ‘పనులు పాక్షికంగా పూర్తయినట్టు’ అనే విషయం లేదు కదా? అని నిలదీయగా, నిజమేనని అంగీకరించారు. ఈఈ సర్టిఫికెట్ జారీ చేయగా తాను కౌంటర్ సంతకం చేశానని, పొరపాటు జరిగిందని బదులిచ్చారు. ఎవరి ఆదేశాలతో మేడిగడ్డ, ఇతర బరాజ్‌ల నిర్మాణం చేపట్టారని కమిషన్ అడగ్గా, రాష్ట్ర ప్రభుత్వం అని వెంకటరమణారెడ్డి బదులిచ్చారు.
రాష్ట్ట్ర ప్రభు త్వం అంటే ఎవరని ప్రశ్నించగా, ప్రభుత్వ అధినేత అని జవాబిచ్చారు. బ్యారేజీలను నీటి మళ్లింపు కోసమే వాడాల్సి ఉండగా, అందుకు భిన్నంగా నిల్వ చేయాలని తమను ఆదేశించారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. టెండర్లను పెంచి కాంట్రాక్టర్‌కు అప్పగించడంలో తప్పు ఎవరిది? అని కమిషన్ అడగ్గా మౌనంగా ఉం డిపోయారు. నిర్మాణ సమయంలోనే 3, 4, 5వ బ్లాకుల్లో లోపాలు బయటపడితే మరమ్మతులు చేశామన్నారు. నిర్వహణలో లోపం జరిగిందని అంగీకరించారు. కొవిడ్ సమయంలో బ్యాంకు గ్యారెంటీలను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం సర్య్కులర్ జారీ చేసిందని వెంటకరమణారెడ్డి, మహదేవ్‌పూర్ ఈఈ సీహెచ్ తిరుపతిరావు స్పష్టం చేశారు. బ్యాంకు గ్యారెంటీలను, పని పూర్తయినట్లు ధ్రువపత్రాలను తానే నిర్మాణ సంస్థకు ఇచ్చానని తిరుపతిరావు తెలియజేశారు.
అన్నారంలో చాలా సమస్యలున్నాయి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరి
అన్నారం బ్యారేజీ నిర్మాణంలో లోపాలు జరిగాయా? అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరిని కమిషన్ ప్రశ్నించగా ‘‘స్థలం ఎంపికలోనే లోపాలున్నాయి. బ్యారేజీ పూర్తయిన తర్వాత నీటిని ఎత్తిపోయడం.. తిప్పి కిందికి పంపించడం చేస్తున్నాం. వరదల అనంతరం ఎగువన, దిగువన భారీగా ఇసుక చేరుతుంది. మేడిగడ్డ సంఘటన తర్వాత అన్నారంలో సీపేజీలు బయటపడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎ్‌సఏ చెప్పింది. ఇప్పుడు అన్నారం గేట్లు మూసివేయాల ని అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి లేదు. గేట్ల కింద 4 మీటర్ల దాకా ఇసుక చేరింది’’ అని ఈఈ వివరించారు.
2019 వరదల అనంతరం సీసీ బ్లా కులు, లాంచింగ్ అఫ్రాన్లు చెల్లాచెదురయ్యాయా? కారణాలేంటి? అని కమిషన్ ప్రశ్నించగా.. ‘‘బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే. కానీ, నిల్వ చేయడం వల్లే సమస్యలు వచ్చాయి. సుందిళ్లలో ఎత్తిపోయాలంటే కనీసం 10-11 మీటర్ల మేర నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. అన్నారం నుంచి సుందిళ్ల దాకా 31 కి లోమీటర్ల దూరం ఉంది. ఈ వ్యవధిలో 32 నదులు కలుస్తాయి. అన్నారానికి 6 కిలోమీటర్ల ఎగువన మానేరు కలుస్తుంది. నియంత్రించడానికి వీల్లేని విధంగా వరద వస్తుంది. ఏటా చేరుతున్న ఇసుకను తొలగించడమే అతిపెద్ద సమస్య’’ అని ఈఈ యాదగిరి తెలిపారు.