Share News

Student Death: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు..

ABN , Publish Date - Aug 09 , 2024 | 10:59 AM

మెట్‌పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాల(Peddapur Gurukula School)లో విద్యార్థుల వరస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు. తమ పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Student Death: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరస మరణాలు..

జగిత్యాల: మెట్‌పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాల(Peddapur Gurukula School)లో విద్యార్థుల వరస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు. తమ పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పెద్దపూర్ గురుకుల పాఠశాలలో అనిరుద్, మోక్షిత్ అనే ఇద్దరు విద్యార్థులు ఇవాళ(శుక్రవారం) ఉదయం 5గంటలకు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి విద్యార్థుల సమాచారం మేరకు హాస్టల్ సిబ్బంది వారిని హుటాహుటిన కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సపొందుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ మృతిచెందాడు. మరో విద్యార్థి మోక్షిత్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.


జులై 27న మరో ఘటన..

అయితే పెద్దపూర్ గురుకుల పాఠశాల హాస్టల్‌లో జులై 27న మరో ఘటన జరిగింది. రాత్రి సమయంలో నిద్రపోతున్న ఇద్దరు విద్యార్థులను పాము కాటు వేయగా వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వారి పక్కనే నిద్రిస్తున్న మరో బాలుడు శవమై తేలాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి మెట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్, ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన ఆడేపు గణేశ్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థులు వసతి గృహంలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 3గంటల సమయంలో వారిని పాము కాటేసింది. అయితే ఏదో పురుగు కుట్టిందని అనుకొని వారు అలాగే పడుకున్నారు.


అయితే ఉదయం 4గంటలకు వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వచ్చి నీళ్లు తాగించినా ఆహారం తినిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 6గంటల సమయంలో వారిని మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు వారిని పాము కాటు వేసిందని గుర్తించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అస్వస్థతకు గురైన తమ పిల్లలకు వెంటనే వైద్యం అందించకుండా ప్రిన్సిపల్, కేర్ టేకర్ నిర్లక్ష్యం వహించారంటూ తల్లిదండ్రులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక్కడే ట్విస్ట్..

అయితే హాస్టల్ సిబ్బందికి ఇక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది. అదే రూంలో పడుతున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడం సంచలనంగా మారింది. మెట్‌పల్లి ఆరపేటకు చెందిన ఘనాదిత్య(13) అనే విద్యార్థి వారితోపాటే పడుకున్నాడు. తెల్లవారుజామున స్టడీ అవర్, వ్యాయామం కోసం నిద్రలేపినా బాలుడు లేవలేదు. పైగా కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి ఉండడంతో మూర్చ వచ్చినట్లు అనుమానించారు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యాసాగర్ విషయాన్ని విద్యార్థి తండ్రికి చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన వచ్చి బాలుణ్ని తన ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఘనాదిత్య మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబం తీవ్ర శోకంలో మునిగింది.


అయితే వరస మరణాలు, అస్వస్థతకు గురవుతున్న ఘటనలు పెద్దపూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భయం గుప్పిట్లో పిల్లలు ఉన్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వరస మరణాల ఘటనలపై విచారణ చేయాలని కోరుతున్నారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 11:02 AM