KCR: విగ్రహ మార్పు మూర్ఖత్వం
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:07 AM
తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఇదొక మూర్ఖపు చర్య అని అన్నారు.
ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా?
ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా?
అసెంబ్లీ, మండలిలో ప్రజా గొంతుకలు కావాలి
రైతు భరోసా, బోనస్, మాఫీపై నిలదీయాలి
ఫిబ్రవరిలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ: కేసీఆర్
ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. దిశానిర్దేశం
కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతాం
ప్రజాప్రతినిధుల నిర్బంధాన్ని ప్రశ్నిస్తాం: కేటీఆర్
మర్కుక్/గజ్వేల్/హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఇదొక మూర్ఖపు చర్య అని అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశం నిర్వహించారు. శాసనసభ, శాసనమండలిలో పార్టీపరంగా చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ తెలియజేయాలని సూచించారు. ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి తెలియజెప్పాలన్నా రు. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్రశ్నించారు. ఫార్మా సిటీని ఎందుకు ప్రతిపాదించామన్న దానిపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను వివరించాలన్నారు. కాంగ్రెస్ నిర్బంధ పాలన, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రొటోకాల్ అంశంపై సమావేశాల్లో ప్రస్తావించాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అంశాల వారీగా నిలదీయాలన్నారు. కాంగ్రె స్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలని, ఆరు గ్యారెంటీల చట్టబద్ధత కోసం పోరాడాలని, రెండు విడతల రైతుబంధు ఇవ్వాల్సిందిగా పట్టుబట్టాలని సూచించారు.
ప్రజలందరి గొంతుకగా పోరాడాలి..
అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలందరి గొంతుకగా పోరాడాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యానికి బోనస్, గురుకులాల్లో సమస్యలు, లగచర్ల ఘట న, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కొనసాగిస్తున్న నిర్బంధకాండపై గట్టిగా పోరాడాలన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని, లగచర్ల బాధితులను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను మోసంగించిన కాంగ్రెస్ సర్కారు వైఖరిని ఎండగట్టేందుకు ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ‘‘ఏడాదిపాటు అవకాశం ఇచ్చి చూశాం. హామీలు అమలు చేయకపోగా.. పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలేదు. ఈ అసమర్థ ప్రభుత్వంపై ప్రజల పక్షాన నిలికి పోరాడదాం’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాగా, బీఆర్‌ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితులపై ఐదుగురు సభ్యుల కమిటీ సిద్ధం చేసిన నివేదికను ఆదివారం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కమిటీ ప్రతినిధులు ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్, వాసుదేవరెడ్డి క్షేత్రస్థాయిలో గుర్తించిన విద్యార్థుల ఇబ్బందులు, సమస్యలను విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు వివరించారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేటీఆర్
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు రైతుభరోసా ఇవ్వలేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిగా కొనుగోళ్లు జరపడంలేదని, రుణమాఫీ అరకొరగా చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. విజయోత్సవాల పేరిట రైతాంగాన్ని దగా చేస్తోందన్నారు. గురుకుల పాఠశాలల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు, బలహీనవర్గాల పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. రైతులు, గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, నిర్బంధాలు, అరె్‌స్టలపైనా అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. ఓవైపు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 14 వేల ఎకరాలు సేకరించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టినప్పటికీ మరోసారి ఫార్మాసిటీ పేరిట భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై అసెంబ్లీలో మాట్లాడుతామన్నారు. తాజా మాజీ సర్పంచుల బిల్లులు, దళితబంధు, బీసీలకు 42ు రిజర్వేషన్లు, రూ.లక్ష కోట్ల బడ్జెట్, 420 హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సునీతా లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ను కలిసిన బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూతురి వివాహానికి ఆహ్వానం
మర్కుక్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో బీజేపీఎల్పీ నేత, నిర్మల్ శాసన సభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తన కూతురి వివాహానికి రావాలని కేసీఆర్‌ను మహేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశం జరుగుతున్న సమయంలోనే మహేశ్వర్ రెడ్డి ఫామ్‌హౌజ్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
అమరులకు నివాళి అనంతరం అసెంబ్లీకి
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. ఈ మేరకు సోమవారం ఉదయం 9:30 గంటలకు వారు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోనున్నారు. అక్కడ నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్నారు