Khammam: గోదావరిలో దూకిన కానిస్టేబుల్
ABN , Publish Date - Sep 07 , 2024 | 03:36 AM
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భార్య, అనుకోకుండా కారుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇలు వరద ముంపునకు గురి కావడం.
మానసికంగా కుంగిపోయి అఽఘాయిత్యం
సెల్ఫీ వీడియోలో తన సమస్యల వెల్లడి.. భద్రాచలంలో ఘటన
భద్రాచలం, సెప్టెంబరు 6: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భార్య, అనుకోకుండా కారుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇలు వరద ముంపునకు గురి కావడం.. ఒకదాని తర్వాత మరొకటి నిత్యం ఏదో ఒక సమస్య ఎదురవుతుండడంతో మానసిక ఆందోళనకు గురైన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన నీలం నాగరమణారెడ్డి.. పాల్వంచలో స్థిరపడ్డారు. కొత్తగూడెం టూ టౌన్‌లో పోస్టింగ్‌లో ఉన్న రమణారెడ్డి కొంతకాలంగా జిల్లా క్లూస్ టీంలో పనిచేస్తున్నారు. గత నెల 24న పాల్వంచలో కారు నడుపుతూ ఆగి వున్న లారీని ఢీ కొట్టి గాయపడిన రమణారెడ్డి ప్రస్తుతం సెలవు పెట్టి విధులకు దూరంగా ఉన్నారు.
అయితే, భద్రాచలంలోని గోదావరి వారధిపైకి శుక్రవారం వెళ్లిన రమణారెడ్డి తన చెప్పులు, సెల్‌ఫోన్‌ను వంతెనపై ఉంచి నదిలోకి దూకేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. చీకటి పడే వరకు గత ఈతగాళ్లు గాలించినా రమణారెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలను శనివారం కొనసాగించనున్నారు. కాగా, ‘నా కుటుంబం మీద ఏదో విషం చిమ్మినట్లు అనిపిస్తోంది. నేను నా జీవితాన్ని ఇంతకంటే ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాను. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేను.. దయచేసి క్షమించండి’ అని రమణారెడ్డి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కారు ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదని, భయం భయంగా ఉంటోందని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కష్టపడి కట్టుకున్న ఇల్లు వరద ముంపునకు గురైందని, 40 ఏళ్లకే తన భార్యకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని బాధపడ్డారు. మానసిక సమస్యల వల్లే రమణారెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డారని భావిస్తున్నారు.