TS News: భద్రాద్రి రామాలయంలో వెలుగుచూసిన భారీ మోసం
ABN , Publish Date - Feb 29 , 2024 | 03:38 PM
భద్రాద్రి రామాలయం(Bhadrachalam Sri Rama Temple) లో భారీ మోసం వెలుగుచూసింది. ఆలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారి చేసిన అవినీతి దందా ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం సత్రం నిర్మాణానికి దాతలు రూ.18 లక్షల నగదును ఆలయానికి ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Sri Rama Temple) లో భారీ మోసం వెలుగుచూసింది. ఆలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారి చేసిన అవినీతి దందా ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం సత్రం నిర్మాణానికి దాతలు రూ.18 లక్షల నగదును ఆలయానికి ఇచ్చారు. అయితే ఆ నిధులను సదరు ఉద్యోగి పక్కదారి పట్టించారు. భద్రాద్రి రామాలయం వద్ద గల సౌమిత్రి సదనం పక్కన నిర్మిస్తున్న సత్రానికి గత మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన దాతలు రూ.18 లక్షలు విరాళంగా అందజేశారు.
రూ.18 లక్షలకు సంబంధించిన రసీదులు ఇవ్వాలని పలుమార్లు వారు అడిగినా ఆ కీలక అధికారి నుంచి సరైన సమాధానం రాలేదు. భయపడిన అధికారి వెంటనే నగదును తీసుకువచ్చి దాతలకు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవికి దాతలు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దాంతో ఆ కీలక అధికారిపై ఈవో చర్యలు చేపట్టారని సమాచారం. ఈ విషయంపై ఈవో రమాదేవి మీడియాకు వివరాలు వెల్లడించారు.
దాతలు ఫిర్యాదు చేశారు: ఈవో రమాదేవి
దాతలు విరాళం విషయంపై తనకు ఫిర్యాదు చేశారని.. అయితే డబ్బులను ఎవరికి అందజేశారో చెప్పలేదని ఆలయ ఈవో రమాదేవి అన్నారు. విరాళం పక్కదారి పట్టిన విషయం తన దృష్టికి రావడంతో సదరు అధికారి పైసలను డోనర్స్‌కు తిరిగి చెల్లించారు. రామాలయం ప్రతిష్ఠ దెబ్బతీసే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ విషయంపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.