TS NEWS: ఉద్యోగాల భర్తీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 27 , 2024 | 08:13 PM
టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించామని.. త్వరలోనే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు.
ఖమ్మం: టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించామని.. త్వరలోనే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు సరైన ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శనివారం నాడు చిలుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు.
పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి త్వరలోనే దిమ్మతిరిగే జవాబు చెబుతామని హెచ్చరించారు. ప్రజల సంపదకు కస్టోడియన్‌గా ఉంటామని హామీ ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటనలకు వస్తే ముందస్తుగానే అరెస్టులు చేసే సంస్కృతి ఉండేదని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్లు ఉండాలి... అందుకే ధర్నా చౌక్‌ని తెరిపించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.