Share News

Khammam: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితికి బీఆర్ఎస్సే కారణం: భట్టి విక్రమార్క..

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:09 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్ల మెనూ ఛార్జీలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అదే పెద్దలు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Khammam: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితికి బీఆర్ఎస్సే కారణం: భట్టి విక్రమార్క..
Deputy CM Bhatti Vikramarka

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్ల పెండింగ్ మెస్ ఛార్జీలన్నీ మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి కొన్ని నెలల మెస్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని భట్టి చెప్పారు. ప్రస్తుతం అన్నీ బిల్లులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. పిల్లల ఆహారంలో ఎక్కడా కల్తీ ఉండకూడదని, నాణ్యత లోపించినట్లు ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పొరపాటున తేడా వచ్చినా సహించేది లేదని, ఉపేక్షించే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బోనకల్‌లోని ప్రభుత్వ హాస్టల్‌ను భట్టి విక్రమార్క సందర్శించారు.


ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. " గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్ల మెనూ ఛార్జీలను పట్టించుకోలేదు. అదే పెద్దలు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. వారికి కనీసం సిగ్గు అనిపించడం లేదు. పాఠశాలలు, హాస్టళ్లు ఈ విధంగా కావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా?. మీ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేయడం లేదు. బాధ్యతగా అంకిత భావంతో పని చేస్తున్నాం. మేము మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తాం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం పాటుపడుతున్నాం. అందుకే అన్నీ ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు బలమైన ఆహారం అందించేందుకు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఒకే రకమైన డైట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.


ఈ మేరకు బలమైన ఆహారం అందించేందుకు వైద్య నిపుణులతో డైట్ ప్లాన్ చేశాం. 40 శాతం మేర డైట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. 8వ తరగతి వారికి రూ.1,540, ఇంటర్, పీజీ వారికి రూ.2,100కు పెంచాం. విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలను సైతం 200 శాతం పెంచాం. ఏడో తరగతి వారికి రూ.175లు, 8వ తరగతి, ఆపై చదివే వారికి రూ.75 నుంచి రూ.275కు పెంచాం. చివరికి హెయిర్ కటింగ్‌ ఛార్జీలూ పెంచాం. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడినప్పటికీ పెంచుతున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలకే కాదు, మాములు హాస్టళ్లకూ పెంచాం. అన్నీ గురుకులాలు, హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణం చేస్తున్నాం. ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వం వసతి గృహాల నిర్మాణాలకు రూ.70 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తోందని" చెప్పారు.


కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ హాస్టళ్లను సందర్శిస్తున్నారు. మెస్ ఛార్జీలు రిలీజ్ చేయడం, నూతన డైట్ ప్రవేశ పెట్టడంతో హాస్టళ్లన్నీ తిరుగుతూ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు.

Updated Date - Dec 14 , 2024 | 03:10 PM