Share News

Kishan Reddy: పేదల ఇళ్లు కూల్చడం సిగ్గుచేటు..

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:48 AM

మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ముందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌ చేశారు.

Kishan Reddy: పేదల ఇళ్లు కూల్చడం సిగ్గుచేటు..

  • ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే పోరాటం తీవ్రం

  • మూసీపై రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా..

  • మూడు నెలలు పేదల ఇళ్లలో ఉంటా

  • సీఎం వచ్చి బాధితుల్ని పరామర్శించగలరా?

  • పేదల జోలికి వెళ్లకుంటే మద్దతిస్తాం: కిషన్‌రెడ్డి

  • కాంగ్రెస్‌ అగ్రనేత అల్లుడి కోసమే ఈ తతంగం!

  • గుడి పేరుతో ఆయన ఇక్కడికొచ్చి

  • కాంట్రాక్టు మాట్లాడుకున్నారు: బండి సంజయ్‌

  • మూసీ సుందరీకరణ నిర్వాసితులకు అండగా

  • ఇందిరాపార్కు వద్ద బీజేపీ మహాధర్నా

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ముందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానిది మోసపూరిత వైఖరి అని, దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోందని, ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు. పేదల ఇళ్ల కూల్చివేతల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. పేద ప్రజల ఇళ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుందని.. పేద ప్రజలు తిరగబడితే ఏ పోలీసు తూటా అడ్డుకోలేదని హెచ్చరించారు. బాధితులకు మద్దతుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని.. ఈ పోరులో చర్లపల్లి జైలుకైనా, చంచల్‌గూడ జైలుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లి, వివరాలు సేకరించి ఉద్యమాన్ని


ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో మూడు నెలలు నివాసం ఉండాలంటూ రేవంత్‌ చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్లలో ఉండేందుకు నేను సిద్ధమే. కనీసం పోలీసు భద్రత మధ్య అయినా సీఎం బాధితుల వద్దకొచ్చి వారి ఆవేదనను తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నారు. మూసీ బాధితులకు అండగా ఇందిరాపార్కు వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. మూసీ పునరుజ్జీవం అంటున్న ప్రభుత్వానికి పేదల ఇళ్ల కూల్చివేయడమే లక్ష్యమా? ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లలో ఉన్న బడా వ్యక్తుల ఫాంహౌజ్‌లను వదలిపెట్టి పేదలపైనే ప్రతాపం చూపిస్తారా? అని మండిపడ్డారు. కేసీఆర్‌ తరహాలోనే రేవంత్‌ పాలనా కొనసాగుతోందని ఆరోపించారు.


హైదరాబాద్‌లో పేదలకు కనీస సౌకర్యాలు కల్పించలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం, రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి మూసీ పునరుజ్జీవం చేస్తుంటం దారుణమని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. అయితే పేదల ఇళ్ల జోలికి వెళ్లొద్దని.. అప్పుడు బీజేపీ కార్యకర్తలు ముందుకొచ్చి సహకరించేందుకు సిద్ధంగా ఉంటారని ప్రకటించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి అల్లుడి కోసమే రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట తతంగం నడుపుతోందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన వట్టిదేనని, కాంగ్రెస్‌ అధినేత్రి అల్లుడు గుడిని చూసే పేరుతో మూసీ పరీవాహక ప్రాంతానికొచ్చి కాంట్రాక్టు మాట్లాడుకున్నారని, లక్షన్నర కోట్ల కాంట్రాక్టు ఫిక్సయిపోయిందని, ఆ డబ్బులు ఆయనకు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.


మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికలకు డబ్బులు పంపేందుకూ ఇక్కడ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. లేదంటే.. రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనేది సీఎం రేవంత్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ పేరిట గతంలో కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని, వారికి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ డ్రామా కంపెనీ అని, ఆ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు. ‘‘నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్నీ కేసీఆరే. ఆయనే ఏక్‌ నిరంజన్‌గా ఉంటే మంత్రులంతా డమ్మీలుగా ఉండేవారు. ఇప్పుడు కాంగ్రె్‌సలో మంత్రుల్లేరు. అంతా ముఖ్యమంత్రులే’’ అని విమర్శించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన వాళ్లను రాజకీయ వ్యభిచారులని కేటీఆర్‌ అంటున్నారని చెబుతూ ‘‘మరి.. మీ నాన్న మొదట ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు ఏ పార్టీ నడుపుతున్నారు?’’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు సరైన రీతిలో సమాధానమిస్తానని స్పష్టం చేశారు.


  • కేఫ్‌కు నిలోఫర్‌ అని పేరెందుకు?

ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న అనంతరం బండి సంజయ్‌ హిమాయత్‌నగర్‌లోని నిలోఫర్‌ కేఫ్‌కు వెళ్లారు. సంజయ్‌ వచ్చారని తెలుసుకున్న ఆ కేఫ్‌ యజమాని బాబూరావు అక్కడికొచ్చి పరిచయం చేసుకున్నారు. చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్‌ రైస్‌ను రుచి చూడాలని సంజయ్‌ను కోరారు. అయితే కేఫ్‌కు నిలోఫర్‌ అని పెట్టడానికి కారణమేమిటని ఆయన్ను ప్రశ్నించారు. తాను 1976లో నిలోఫర్‌ ఆస్పత్రి వద్ద రోజుకు రెండు రూపాయలకు పనిచేసేవాడినని.. తర్వాత అక్కడే టీ, బిస్కెట్లు అమ్మానని..గిరాకీ బాగా ఉండటంతో కేఫ్‌ పెట్టానని బాబూరావు వివరించారు.

Updated Date - Oct 26 , 2024 | 03:48 AM