Kishan Reddy: కాంగ్రెస్‌లో మన్మోహన్‌కు ఎన్నో అవమానాలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:44 AM
ప్రధానిగా మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు సోనియా గాంధీ కుటుంబం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొని దేశానికి సేవలందించారని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు.
అగ్రనేతల నుంచి అడుగడుగునా పరాభవాలు.. ప్రధానిగా పదేళ్లు వాటిని భరిస్తూనే దేశానికి సేవలు
యూపీఏలో షాడో పీఎంలుగా సోనియా, రాహుల్
ఆర్డినెన్స్‌ను చించేసిన రాహుల్.. పీవీ భౌతికకాయాన్ని పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్లకుండా బెదిరించిన సోనియా
ఇప్పుడు మన్మోహన్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు
కేంద్రం సంతాప దినాలు ప్రకటిస్తే.. నూతన సంవత్సర వేడుకల కోసం రాహుల్ వియత్నాం వెళ్లడం ఏంటి?
విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రధానిగా మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు సోనియా గాంధీ కుటుంబం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొని దేశానికి సేవలందించారని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ మరణంపై సోనియా కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, ఇది వారి సంస్కారరాహిత్యానికి అద్దంపడుతుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని, ఇదేనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. మన్మోహన్ మరణ వార్త తెలియగానే ప్రధాని మోదీ వెంటనే నిర్ణయం తీసుకుని మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఎలా అంత్యక్రియలు జరిగాయో అదే రీతిలో నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిని ఆదేశించారని పేర్కొన్నారు. మన్మోహన్ స్మారక కేంద్రం నిర్మించాలని కూడా నిర్ణయించారని, దీని కోసం ట్రస్టు ఏర్పాటుకు మన్మోహన్ సతీమణితో మోదీ మాట్లాడారని తెలిపారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదన్నారు.
ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారు
మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా కుటుంబం ఆయనను ఎలా అవహేళన చేసి అవమానించిందో దేశ ప్రజలకు తెలుసని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ షాడో ప్రధాలుగా వ్యవహరించారని విమర్శించారు. నాడు మన్మోహన్ అధ్యక్షతన క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను మీడియా సమక్షంలో రాహుల్ చించివేశారన్నారు. 2007లో మన్మోహన్ ప్రధాని హోదాలో 2జీ స్పెక్ట్రం వేలం వేయాలని టెలికాం మంత్రి ఏ రాజాకు లేఖ రాస్తే, దానికి విరుద్ధంగా సోనియా ఆదేశాలతో కుంభకోణానికి తెరలేపారని, ఈ కేసులో రాజా జైలుకు వెళ్లారన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు ప్రపంచ దేశాల అధినేతలను ఆహ్వానిస్తే, భారత్ నుంచి ప్రధానికి కాకుండా సోనియా, రాహుల్‌కు ఆహ్వానాలు ఎలా అందాయని, వారు ప్రభుత్వ ప్రతినిధులుగా ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. ప్రధానిగా మన్మోహన్ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విందుకు రాహుల్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం, చివరికి బోర్లా పడటం రాహుల్ గాంధీకి అలవాటైందన్నారు.
గొప్ప నేతలను అవమానించిన కాంగ్రెస్
నెహ్రూయేతర కుటుంబాలకు చెందినవారు ప్రధాని, రాష్ట్రపతిగా ఉంటే వారి పట్ల అవమానకరంగా వ్యవహరించడం మొదటి నుంచీ నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలనూ ఇలాగే అవమానించారని పేర్కొన్నారు. పీవీ మరణిస్తే ఆయన పార్ధివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లనివ్వకుండా సోనియా బెదిరించారని ఆరోపించారు. కాంగ్రె్‌సలో సాధారణ నాయకులకు దక్కిన గౌరవం కూడా పీవీకి దక్కకుండా చేశారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు అనేక మంది గొప్ప నేతలను అవమానించిన చరిత్ర కాంగ్రె్‌సదని విమర్శించారు. మన్మోహన్ సింగ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ మొసలికన్నీరు కారుస్తోందని మండిపడ్డారు.