Share News

Komatireddy Venkat Reddy : రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:00 AM

నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌) సహా కీలక ప్రాజెక్టులకు గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులిచ్చి రెండేళ్లలో పూర్తిచేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Komatireddy Venkat Reddy : రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తాం

  • మార్చిలో బ్రాహ్మణవెల్లెంల ప్రారంభిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

నార్కట్‌పల్లి, జూలై 21: నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌) సహా కీలక ప్రాజెక్టులకు గ్రీన్‌చానల్‌ ద్వారా నిధులిచ్చి రెండేళ్లలో పూర్తిచేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిర్వహించిన సుదర్శన సహిత రుద్రయాగం పూర్ణాహుతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యజ్ఞగుండం వద్ద కూర్చుని పూజలు చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే మార్చిలోగా బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పూర్తిచేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ఈ ప్రాంత రైతుల కాళ్లను కృష్ణానీటితో కడుగుతామని పునరుద్ఘాటించారు. ప్రజలు, పాలకులు సుభిక్షంగా ఉండాలని వేణుగోపాలస్వామిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

సర్వ మానవాళి హితాన్ని కాంక్షిస్తూ గోపలాయపల్లి క్షేత్రంపై వచ్చే ఏడాది ఆయుత చండీయాగాన్ని ప్రభుత్వం తరపున నిర్వహించేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. కేంద్ర మంత్రి గడ్కరీతో తనకున్న చొరవతోనే హైద్రాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులను మంజూరు చేయించానని, ఈ పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు.

Updated Date - Jul 22 , 2024 | 03:00 AM