Share News

Venkat Reddy: మూసీకీ అడ్డుపడితే మరో పోరాటమే!

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:56 AM

నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని దాదాపు కోటిమంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని బీఆర్‌ఎస్‌ నేతలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.

Venkat Reddy: మూసీకీ అడ్డుపడితే మరో పోరాటమే!

  • బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లను లక్షల మందితో శాంతియుతంగా ముట్టడిస్తాం

  • కోటి మంది బతుకుల బాగు కోసమే మూసీ పునరుజ్జీవం: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని దాదాపు కోటిమంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని బీఆర్‌ఎస్‌ నేతలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. మూసీ పనులకు అడ్డంపడితే బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లను నల్లగొండకు చెందిన లక్షల మందితో కలిసి శాంతియుతంగా ముట్టడిస్తామని హెచ్చరించారు. మూసీకి అడ్డుపడే ప్రతి రాజకీయ పార్టీని నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు. మూసీ కాలుష్యంతో ప్రజలు వివిధ అనారోగ్యాలతో నానా అవస్థలు పడుతున్నారని.. ఇంకా వాళ్లు అలాగే చచ్చిపోవాలని కేటీఆర్‌ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ విషయంలో వెనకడుగువేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


ప్రధాని మోదీ.. సబర్మతి, నమామీ గంగ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మాట్లాడని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల ఇప్పుడు మూసీకి ఎందుకు అడ్డంపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని.. కిషన్‌రెడ్డికి ఏమీ తెల్వదని, అసలు ఆయన రాజకీయ నాయకుడే కాదని విమర్శించారు. శనివారం సచివాలయంలో మంత్రి మాట్లాడారు. మూసీ పరీవాహక పరిధిలోని కోటిమంది బతుకులు బాగు చేేసందుకే మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టామని, తమ ప్రభుత్వం ఏర్పడగానే మంత్రులంతా సీఎం రేవంత్‌ను కలిసి ఇదే విషయంపై చర్చించి మూసీకి పరిష్కారం చేయాలని కోరిన విషయాన్ని తెలిపారు. మూసీపై డీపిఆర్‌ చేసిన మెయిన్‌హార్డ్‌ టీ కంపెనీ 29 దేశాల్లో అద్భుతమైన కట్టడాలను నిర్మించిందని, అలాంటి కంపెనీపై ఎక్కడో పాకిస్థాన్‌లో కేసు అయ్యిందంటూ బురదజల్లడం దారుణమన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం డీపీఆర్‌ను తయారు చేసిన వ్యాప్కో్‌సను ఒడిసా గవర్నమెంట్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిందన్న విషయాన్ని గుర్తుచేశారు.


మూసీపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చూయించిన కేటీఆర్‌.. ఆయన బంధువుల సంస్థ గ్లోబరినా పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని ఎందుకు ప్రజలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వేసి చూపించలేదని ప్రశ్నించారు.. కాళేశ్వరం డీపీఆర్‌ కోసం 2015 లోనే రూ.33కోట్లు చెల్లించారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ డీపీఆర్‌కు రూ.141 కోట్లు చెల్లిస్తుంటే గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తోందని.. డాక్టర్‌కు చూపించుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. కేసీఆర్‌ కొడుకుగా తప్ప కేటీఆర్‌ను ఎవరు గుర్తుకూడా పట్టరని.. అట్లాంటి వాళ్లు కూడా రేవంత్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివిన ప్రపంచ మేథావి కేసీఆర్‌ ఫాంహౌజు నుంచి బయటికు వచ్చి మూసీ వల్ల మూడు జిల్లాల ప్రజలు పడుతున్న సమస్యలపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.


కాగా కాంగ్రెస్‌ పుణ్యానే కేసీఆర్‌ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులయ్యారని, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పార్టీతో ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు. హరీశ్‌ రావు నాటకాల రాయడని, ఉద్యమం సమయంలో ఒంటిపై నీళ్లు పోసుకుని అగ్గిపెట్టే దొరకలేదని ప్రచారం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రంగనాయక్‌సాగర్‌ దగ్గర హరీశ్‌కు 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందని, పాల డెయిరీ, పౌలీ్ట్ర వ్యాపారంతోపాటు నారాయణ కళాశాలలో వాటా ఉందన్నారు. అసలు హరీశ్‌ను కొన్ని కేసుల్లో జైలుకు పంపొచ్చన్నారు. నల్లగొండ జిల్లాలో పుట్టిన చిట్టి నాయుడు మొన్నటి ఎన్నికల్లో 3 వేల ఓట్లతో గెలిచినప్పటికీ ఆయనకు జిల్లా సమస్యలు పట్టవంటూ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.

Updated Date - Oct 20 , 2024 | 02:56 AM