Koonamneni: పదేళ్లు తెలంగాణ గొంతు నొక్కారు
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:30 AM
అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు తెలంగాణతో పాటు రాష్ట్ర ప్రజల గొంతు నొక్కేశారని, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అలాగే వ్యవహరిస్తారా అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలోనూ అంతే వ్యవహరిస్తారా: కూనంనేని
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు తెలంగాణతో పాటు రాష్ట్ర ప్రజల గొంతు నొక్కేశారని, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అలాగే వ్యవహరిస్తారా అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ భారతి 2024 చట్టంపై చర్చజరుగుతున్న సమయంలో ఫార్ములా ఈ కేసుపై చర్చ జరపాలని పట్టుబడుతూ బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో భూ భారతి చట్టంపై మాట్లాడాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును స్పీకర్ సూచించారు. కూనంనేని మాట్లాడుతూ.. దేశంలో వివిధ అంశాలపై చాలా మందిపై కేసులు పెడతారని, మీ ఒక్కరి మీదే కేసు పెట్టారా అంటూ బీఆర్‌ఎస్ సభ్యులని ప్రశ్నించారు.
గడిచిన పదేళ్లు ప్రజలతో పాటు విపక్షాల గొంతును కూడా నొక్కారని, రేవంత్‌రెడ్డిని కూడా 5 నిమిషాల కంటే ఎక్కువ సభలో మాట్లాడనివ్వలేదన్నారు. ఇప్పుడూ మీరు చెప్పిందే జరగాలంటే ఎలా అంటూ కూనంనేని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నిలదీశారు. సభలో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన చేస్తుండగా వారి చేతికి అందిన కాగితాన్ని అందినట్టు చించివేస్తున్నారని కూనంనేని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడేందుకు సిద్ధం చేసుకున్న కాగితాలను చించివేశారని చెప్పారు. అదే తరహాలో తన ప్రసంగానికి సంబంధించిన కాగితాలను కూడా చించుతారేమోనని అనుమానంతో తన స్థానాన్ని మార్చుకుని కూర్చున్నానని చెప్పారు.