Karimnagar: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేయాలి..
ABN , Publish Date - May 28 , 2024 | 03:53 AM
తన ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఎన్నికల ప్రచారంలో తన ప్రతి కదలికను ముందే తెలుసుకుని, తనకు మద్దతు ఇచ్చే వారిని బెదిరించి, అడ్డదారిలో గెలిచిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు డిమాండ్ చేశారు.
నా ఫోన్ ట్యాప్ చేసి.. ఆయన అడ్డదారిలో గెలిచారు
నైతిక విజయం నాదే: కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగారావు
కరీంనగర్ అర్బన్, మే 27 : తన ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఎన్నికల ప్రచారంలో తన ప్రతి కదలికను ముందే తెలుసుకుని, తనకు మద్దతు ఇచ్చే వారిని బెదిరించి, అడ్డదారిలో గెలిచిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడారు. తన ఫోన్ ట్యాప్ చేసినట్లుగా మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవబోతున్నాన ని తెలిసి కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయించారని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితను తెలంగాణ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు ఆస్తులన్నీ బినామీల పేరిట ఉన్నాయని, ఈ బినామీలు ఆయా ఆస్తులను తిరిగి హరీశ్‌రావుకు ఇవ్వొద్దని సూచించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. హరీశ్‌రావు ఆదేశాల మేరకు తన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు రాధాకిషన్‌రావు ఒప్పుకున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.