KTR: రేవంత్‌కు రక్షణ కవచంగా కమలదళం
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:28 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమల దళం రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర అంటున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసీసీకి ఎందుకంత సంతృప్తి
భూసేకరణను రాహుల్ గాంధీ అడ్డుకోలేదే
‘లగచర్ల’ను మళ్లించేందుకే మూసీ నిద్ర: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమల దళం రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర అంటున్నారని తెలిపారు. మూసీ బాధితుల ఆక్రందనలు కిషన్ రెడ్డికి ఇప్పటికీ గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆదివారం పోస్టు చేశారు. స్నేహితుడిని(రేవంత్ రెడ్డిని) కాపాడేందుకు బీజేపీ చీకటి రాజకీయం చేస్తోందని విమర్శించారు. హైడ్రాను మొదట స్వాగతించింది బీజేపీ అని, మూసీ బాధితులకు భరోసా ఇచ్చింది బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. బీజేపీకి అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుక మతలబు ఏమిటి? అని నిలదీశారు.
లగచర్ల రైతులకు బీజేపీ అన్యాయం చేస్తోందని, ప్రజలు సరైన వేళ బీజేపీ, కాంగ్రెస్ ఆట కట్టిస్తారని హెచ్చరించారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. అమాయకులైన రైతులను జైలు పెట్టినందుకు, కొడంగల్‌లో బలవంతంగా భూ ముల గుంజుకున్నందుకు, మూసీ ప్రాజెక్టు అని వేల ఇళ్లు కూల్చివేతకు సిద్ధమైనందుకు, హైడ్రా పేరిట ప్రజలను భయపెట్టినందుకు సర్కారుపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందా? అని నిలదీశారు. కాగా, దేశవ్యాప్తంగా భూేసకరణపై రాహుల్‌గాంధీ చేస్తోన్న రణగర్జన తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేదని కేటీఆర్ మరో పోస్టు చేశారు. రామన్నపేటలో అదానీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు తెరవడమేంటని రాహుల్‌ను ప్రశ్నించారు. అదానీ, అంబానీలపై రాహుల్ పోరాటం ఓ బూటకమని ఆరోపించారు.