KTR: రైతు భరోసా ఎగవేతపై ఎదిరించండి
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:10 AM
‘కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తే.. కోతలు, కొర్రీలు పెట్టి రైతు భరోసాను ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని.. అసెంబ్లీలో ఒక మాట చెప్పి తప్పించుకున్నారు.
పంట పెట్టుబడి కోసం సర్కారును పట్టుబట్టండి
అన్నదాతలకు కేటీఆర్ బహిరంగ లేఖ
కృష్ణా జలాల్లో వాటా కోసం సీఎం రేవంత్ నోరు విప్పట్లేదని ఫైర్
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తే.. కోతలు, కొర్రీలు పెట్టి రైతు భరోసాను ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని.. అసెంబ్లీలో ఒక మాట చెప్పి తప్పించుకున్నారు. రైతన్నలారా.. పెట్టుబడి సాయం అందించకుండా రైతు భరోసా ఎగవేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారును ఎదిరించండి’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణలోని అన్నదాతలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, క్వారీలకు రూ.22 వేల కోట్లు రైతు బంధు పేరిట ఇచ్చారని కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ ప్రచారంతో రైతులను అవమానిస్తోంది. రైతాంగం మోసపోకుండా జాగ్రత్తపడాల్సిన సందర్భమిది.. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం.. మాయోపాయం చేసి మమ అనిపించి.. ఆ తర్వాత పెట్టుబడి సాయానికి పూర్తిగా సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదు గోస మాత్రమే మిగులుతుంది’ అని అన్నారు.
‘అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరిట రూ.15 వేలు పెట్టుబడి ఇస్తామన్నారు. ఏడాది గడిచినా దాని జాడేలేదు. ఇక సంక్రాంతి తర్వాత వేస్తామంటున్న రైతు భరోసా కౌలు రైతులకు వేస్తారా? లేదా చెప్పడం లేదు. ఈ వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగికి రూ.2,500 కోత వేశారు. రేవంత్ సర్కారు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ పడ్డది.. ఆ డబ్బులను రైతులు వదులుకోవద్దు. రాష్ట్రంలో 70 లక్షలకు పీఎం కిసాన్ రావాల్సి ఉన్నా.. 30 లక్షల మందికి కూడా దక్కడం లేదు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పడిపోతోంది. చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు ఎత్తులను తిప్పికొట్టాలి. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను గల్లాపట్టి నిలదీయాలి. మేమూ.. మీతో కలిసి నడుస్తాం.. మీ ఆందోళనకు అండగా ఉంటాం’అని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే.. సీఎం రేవంత్.. కృష్ణాజలాల్లో తెలంగాణ నీటి వాటా గురించి నోరు తెరవడం లేదని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా కాంగ్రెస్‌కు పట్టడం లేదని, కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా చలనం లేదని విమర్శించారు.