KTR: గెలవలేమనే అడ్డగోలు హామీలిచ్చారు..
ABN , Publish Date - Oct 18 , 2024 | 03:41 AM
‘‘గెలుస్తామని అనుకోకుండా అడ్డగోలు హామీలిచ్చామని ఓ కాంగ్రెస్ మంత్రి ఇటీవల నాతో అన్నారు. మీరే 15 మందిని మార్చుకుని ఉంటే గెలుస్తుండే అని చెప్పారు.
ఈ విషయం ఓ కాంగ్రెస్ మంత్రి చెప్పారు.. 15 మందిని మార్చి ఉంటే మీరే గెలుస్తుండే అన్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏమీ తెల్వదు.. తెల్వదన్న విషయమూ తెల్వదు
లోపభూయిష్ట విధానాలతో గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ రద్దయ్యే పరిస్థితి
పైన జుమ్లా పీఎం.. ఇక్కడ హౌలా సీఎం.. 25 సార్లు ఢిల్లీకెళ్లి రేవంత్
చేసిందేమీ లేదు.. మూసీ బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘గెలుస్తామని అనుకోకుండా అడ్డగోలు హామీలిచ్చామని ఓ కాంగ్రెస్ మంత్రి ఇటీవల నాతో అన్నారు. మీరే 15 మందిని మార్చుకుని ఉంటే గెలుస్తుండే అని చెప్పారు. నా పేరు చెప్పవద్దంటూ అన్నీ చెప్పేశారు’’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్వీ ప్రతినిధులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. అంతకుముందు గ్రూప్-1 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో సమావేశమై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో మహా ఉద్ధండ పిండాలతో కొట్లాడినం. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.
అంతటి ఉద్ధండుల ముందు ఈ చిట్టి నాయుడు ఒక లెక్క కాదు. ఈయనతో కొట్లాడదామంటే కూడా మనసు ఒప్పడం లేదు. మొన్న వికారాబాద్ వెళ్లి హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కులు సముద్రం ఉందంటాడు. ఆగస్టు 15 రోజు ప్రసంగంలో భాక్రానంగల్ డ్యాం ఉందన్నాడు. రేవంత్ రెడ్డి ప్రకారం.. విప్రో సీఈవో సత్య నాదెళ్ల. ఆయనకు ఏం తెల్వదు. తెల్వదన్న విషయం కూడా ఆయనకు తెల్వదు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉంది పరిస్థితి. ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చినా.. గాంధీ భవన్, బీజేపీ ఆఫీ్‌సకు కాకుండా తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. తెలంగాణ భవన్‌కు వెళ్తే కేసీఆర్ దండు ఉంటదని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. హైడ్రా బాధితులు కూడా ఇక్కడికే వస్తున్నారు. చిట్టినాయుడు పాలనలో బాధపడని వాళ్లు లేరు. ఊళ్లలో రైతులు తిడుతున్నారు. తులం బంగారం, బతుకమ్మ చీరలు.. ఏదీ దిక్కులేని పరిస్థితి తెచ్చారన్నారని మండిపడుతున్నారు’’ అని ఆయన అన్నారు.
గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కినా పట్టించుకోరా?
‘‘గ్రూప్-1 కోసం అశోక్‌నగర్‌లో విద్యార్థులు రోడ్డెక్కారు. గ్రూప్-1 పరీక్షల్లో అన్యాయం జరుగుతుందని వారంటున్నారు. కేసీఆర్ తెచ్చిన 95ు రిజర్వేషన్‌కు తూట్లు పొడుస్తున్నారు. స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తే.. మాకు రాకుండా చిట్టినాయుడు చేస్తున్నారని పిల్లలు ధర్నాకు కూర్చున్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో విద్యార్థులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ రాసేందుకు ఇబ్బంది లేదని అభ్యర్థులు చెబుతున్నారు. 3లక్షల మందిలో 30వేల మంది అర్హత సాధించామని చెబుతున్నారు. మెయిన్స్ రాసిన తర్వాత ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల పరీక్ష రద్దు అయ్యి మళ్లీ రాయాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. అశోక్ నగర్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అక్కడ పోలీసులను పెట్టటంతో విద్యార్థులే తెలంగాణ భవన్‌కు వచ్చారు’’ అని కేటీఆర్ తెలిపారు.
మళ్లీ ప్రజలు మెచ్చే విధంగా దగ్గరవుదాం
తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా బీజేపీ వాళ్లు ప్రశ్నించరు. పేదల ఇళ్లు కూల్చినా.. చిట్టి నాయుడు మొత్తం తెలంగాణను నాశనం చేసినా.. బీజేపీ వాళ్లు మాట్లాడరు. ఎందుకంటే బడే భాయ్.. చోటే భాయ్ ఇద్దరూ ఒక్కటే. పైననేమో జుమ్లా పీఎం.. ఇక్కడ హౌలా సీఎం. మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఈ రెండు పార్టీలతోనే. మతాన్ని, దేవుడ్ని అడ్డం పెట్టుకుని పిల్లల్ని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమి లేదు. పదినెలల్లో మన పార్టీ అన్ని కష్టకాలాలను అధిగమించింది. చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఊహించని విధంగా ఓడిపోయాం. ఆ తర్వాత కేసీఆర్‌కి గాయం. కొంతమంది పార్టీ మారటం, మన పార్టీ నాయకురాలు కవితను జైలుకు వెళ్లడం జరిగింది. తలవంచకుండా పోరాటం చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలు మనకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.
వాళ్లను అనటానికి ఏమీ లేదు. మళ్లీ ప్రజలు మెచ్చే విధంగా వాళ్లకు దగ్గరవుదాం అని కేటీఆర్ అన్నారు. మరోవైపు.. మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. మూసీ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. తమకు అండగా ఉండాలని గురువారం తెలంగాణ భవన్‌కు వచ్చిన బాధితులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, న్యాయ సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా, పోను 25 సార్లు.. రాను 25 సార్లు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి తట్టా మట్టి తీసింది లేదు.. కొత్తగా చేసింది అసలే లేదు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో సీఎం 25 సార్లు ఢిల్లీకి వెళ్లారన్నారని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.