Share News

KTR: పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:44 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ముదిరాజ్‌వాడ అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణి చేయడం దారుణమని, అధికారులు వెంటనే స్పందించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

KTR: పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం

  • భువనగిరి అంగన్‌వాడీలో కుళ్లిన గుడ్ల పంపిణీపై కేటీఆర్‌ ట్వీట్‌

భువనగిరి టౌన్‌/హైదరాబాద్‌, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ముదిరాజ్‌వాడ అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణి చేయడం దారుణమని, అధికారులు వెంటనే స్పందించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ నెల 22వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి శరత్‌రెడ్డి అనే నెటిజన్‌ కుళ్లిన కోడిగుడ్డు వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు చేయగా... దాన్ని కేటీఆర్‌ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ను ట్యాగ్‌ చేస్తూ... ‘పసిపిల్లల ప్రాణాలతో సర్కారు చెలగాటం’ అంటూ రీ ట్వీట్‌ చేశారు. కాగా, ఈనెల 22వ తేదిన అంగన్‌వాడీ టీచరు సెలవులో ఉండగా ఉడకబెట్టిన గుడ్లలో కుళ్లిన వాటిని గమనించిన ఆయా... వాటిని వెంటనే పారవేసినప్పటికీ, కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి సీడీపీవో(చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌) నర్మద తెలిపారు.


  • రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరగడంతో పడకలు దొరక్క జనం అవస్థలు పడుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సీరియ్‌సగా పరిగణించి.. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎస్‌ శాంతికుమారికి ఎక్స్‌ వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, కొండకల్‌లో ఏర్పాటు చేసిన మేధా కోచ్‌ ఫ్యాక్టరీ ఇప్పుడు వందేభారత్‌ ట్రైన్‌ కోచ్‌ల తయారీలో కీలకంగా మారిందని కేటీఆర్‌ తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన ఫ్యాక్టరీ విజయవంతంగా ప్రయాణం సాగించడం అందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 04:44 AM