Share News

KTR: బీసీలకు కాంగ్రెస్‌ ఒక్క హామీనీ నెరవేర్చలే

ABN , Publish Date - Nov 11 , 2024 | 04:33 AM

బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

KTR: బీసీలకు కాంగ్రెస్‌ ఒక్క హామీనీ నెరవేర్చలే

  • 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే

  • స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

  • కులగణనను స్వాగతిస్తున్నాం

  • సర్వేకొచ్చేవారిని హామీలపై నిలదీయాలి

  • కాంగ్రెస్‌ ఏడాది వైఫల్యాలపై వారోత్సవాలు

  • పొంగులేటిది బాంబుల మంత్రిత్వశాఖ: కేటీఆర్‌

వరంగల్‌/సిరిసిల్ల/యాదగిరిగుట్ట రూరల్‌/హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ఒక్క బీసీ డిక్లరేషన్‌ హమీ అయినా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. ఆదివారం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన పూర్తయిన తరువాత, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తాము కులగణనను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇంటింటి సర్వేకు వచ్చే అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతులకు పంటపై బోనస్‌ రూ.500లు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.


ఏ ఒక్క రైతుకైనా రూ.500ల బోసన్‌ ప్రభుత్వం ఇచ్చినట్లు నిరూపిస్తే తాము రాజీనామాలకు సిద్ధమని సవాల్‌ చేశారు. ఒక్క బీసీకైనా వడ్డీ లేని రూ.10లక్షల రుణం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. తొలి ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.8వేల కోట్లే ప్రకటించిందని, అవికూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని విమర్శించారు. సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని ఆందోళన చేస్తుంటే దుర్మార్గంగా అరెస్టులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. బీసీ వెల్ఫేర్‌తో పాటు ఎంబీసీలకు మరో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారని, తన క్యాబినెట్‌లో 18మంది మంత్రులను భర్తీ చేసుకునే చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి అని, కొత్త మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తా.. అంటే ఎవరు న మ్ముతారని ప్రశ్నించారు. దళిత బంధు నిధులు ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడులు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, అబద్ధాల సీఎంను బీఆర్‌ఎస్‌ తరుఫున నిలదీస్తూనే ఉంటామన్నారు. ప్రభుత్వం ఏం సాధించిందని విజయోత్సవాలకు ఏర్పాటు చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలపైన తాము కూడా వారోత్సావాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి బాంబుల శాఖ ఇచ్చారేమో.. ఆయన రోజుకో బాంబు పేల్చుతానంటున్నారని, ఆ బాంబు కాంగ్రెస్‌ మంత్రుల్లో ఎవరిపైన పేలుతుందో అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


  • నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండటం ఇబ్బందిగా ఉంటే రాజీనామా చేస్తా

‘ఎంతమంది నేత కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే సిగ్గువస్తుంది. భేషజాలు వదిలిపెట్టు. సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బంది ఐతే, ఇక్కడి ప్రజలపై ప్రేమ కలగడం లేదంటే రేపే ఎమ్మెల్యే పదవిని వదిలేస్తా’ అని కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటలో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు బైరి అమర్‌, స్రవంతి దంపతుల కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ముగ్గురు పిల్లలను అనాథలు చేసి యువజంట ఆత్మహత్య చేసుకోవడం ఎవరికైనా కన్నీళ్లు పెట్టించే పరిస్థితి అన్నారు. ఈ ముగ్గురు పిల్లలను తాను చదివిస్తానని, పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పారు. నేతన్న కడుపు కొట్టినట్లు,.. పగబట్టినట్లు బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్‌లు, రంజాన్‌, క్రిస్మ్‌సకు అందించే కానుకలు రద్దు చేసి సిరిసిల్లలో నేత కార్మికులకు పనిలేక పొట్టగడవని పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు.


ఇప్పటికైనా ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. ‘వచ్చేది మన ప్రభుత్వమే, అన్ని పథకాలు యథావిధిగా కొనసాగుతాయని’ కేటీఆర్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వెళ్తున్న ఆయనకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న చొల్లేరుకు చెందిన తోటకూరి వెంకటమ్మ అనే వృద్ధురాలితో కేటీఆర్‌ ముచ్చటించారు. పింఛన్లు, రైతు భరోసా వంటి పథకాలు అందుతున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడగ్గా.. ఏం ప్రభుత్వ మో ఏమో సారూ.. రైతుభరోసా, ఫించన్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆమె చెప్పారు. దీంతో స్పందించిన కేటీఆర్‌.. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ సీఎం అవుతారని, ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నారు. కాగా, కాంగ్రెస్‌ పాలన చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేపట్టాల్సింది విజయోత్సవాలు కాదని.. కుంభకోణాల కుంభమేళా అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలేనని.. కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా అంటూ ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ప్రశ్నించారు.

Updated Date - Nov 11 , 2024 | 04:33 AM