KTR: అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి
ABN , Publish Date - Nov 23 , 2024 | 04:16 AM
అదానీ బండారం అంతర్జాతీయంగా బయటపడిన నేపథ్యంలో ఆ కంపెనీలతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
అదానీ అవినీతిపరుడు అని రాహుల్ అన్నారు.. అలాంటి వ్యక్తికే ఎర్రతివాచీలా?
అదానీతో రేవంత్ నాలుగు గంటలు భేటీ
అదానీ వస్తే చాయ్ తాగించి పంపాం
మేము ఒప్పందాలు చేసుకోలేదు: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అదానీ బండారం అంతర్జాతీయంగా బయటపడిన నేపథ్యంలో ఆ కంపెనీలతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారం బయటపడిన తర్వాత కెన్యా లాంటి చిన్న దేశమే వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకున్నదని, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీ అవినీతి పరుడని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ అంటుంటే అదే వ్యక్తికి ఎర్ర తివాచీలు పరిచి వ్యాపారం ఎలా చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీదీ ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో మరో మాట అని విమర్శించారు. బడేభాయ్ ఆదేశించగానే చోటే భాయ్ అదానీకి స్వాగతం పలికి 12వేల 400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నారన్నారు.
తమ హయాంలో అదానీ తెలంగాణలో వ్యాపారం చేద్దామని వస్తే ఆయన చరిత్ర తెలుసు కాబట్టి చాయ్ తాగించి పొటో దిగి పంపామని చెప్పారు. అదానీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని పేర్కొన్నారు. యాదాద్రిలో సిమెంట్ ఫ్యాక్టరీ వద్దన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయసేకరణ జరిపి అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ కట్టబెట్టారన్నారు. దీంతో అదానీ స్కిల్ యూనివర్సీటీకి వందకోట్లు విరాళం ఇచ్చారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయనతో అదానీ నాలుగు గంటలు సమావేశం అయ్యారని, అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కోహినూర్ హోటల్‌లో అదానీతో మంత్రి పొంగులేటి సమావేశంపైనా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదానీ తన వ్యాపారాల విస్తరణకు లంచాలు ఇచ్చారన్న విషయా న్ని అమెరికన్ దర్యాప్తు సంస్ధలు బహిర్గతం చేసిన క్రమంలో విద్యుత్ ఒప్పందాల కోసం లంచంగా తీసుకున్న వారు ఎవరైనా చర్యలు తీసకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ 1750 కోట్లు లంచం తీసుకున్నారని తేలిందిగా ఆని ప్రశ్నించగా.. జగనైనా, మరెవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
అది సీఎం సోదరులు చేసిన హత్య
నాగర్‌కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది ఆత్మహత్య కాదని, ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య అని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్యకు ముందు సాయిరెడ్డి చాలా సృష్టంగా సీఎం సోదరులు తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నాని సూసైడ్ నోట్‌లో రాశారని పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ ప్రారంభించిన నీలి విప్లవం ఫలితాలు ఇప్పు డు కన్పిస్తున్నాయని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. 2016-17లో లక్షా 93వేల టన్నుల చేపల పెంపకం నుంచి 2023-24లో 4.39 లక్షల టన్నులకు పెరిగిందని, చేపల పెంపకంలో తెలంగాణకు ఇన్ ల్యాండ్ స్టేట్ అవార్డు రావడం కేసీఆర్ విజయమన్నారు.