Share News

KTR: నేరం లేదు.. ఉన్నదంతా రాజకీయ కుట్రే

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:22 AM

ఫార్ములా ఈ-రేస్‌ అంశంలో ఎలాంటి నేరం జరగలేదని, ఇదంతా రాజకీయ కుట్ర మాత్రమేనని మాజీ మంత్రి కేటీఆర్‌ హైకోర్టుకు తెలిపారు. అనుమతుల వ్యవహారాన్ని చూసుకోవాల్సింది అధికారులే తప్ప.. నాటి మంత్రిగా తాను కాదని చెప్పారు.

KTR: నేరం లేదు.. ఉన్నదంతా రాజకీయ కుట్రే

  • నాపై కేసు పెట్టాలనే దురుద్దేశంతోనే వాయిదాల ఎగవేత

  • ఏసీబీ కౌంటర్‌కు రిప్లై దాఖలు చేసిన కేటీఆర్‌

ఫార్ములా ఈ-రేస్‌ అంశంలో ఎలాంటి నేరం జరగలేదని, ఇదంతా రాజకీయ కుట్ర మాత్రమేనని మాజీ మంత్రి కేటీఆర్‌ హైకోర్టుకు తెలిపారు. అనుమతుల వ్యవహారాన్ని చూసుకోవాల్సింది అధికారులే తప్ప.. నాటి మంత్రిగా తాను కాదని చెప్పారు. హెచ్‌ఎండీఏ బాధ్యతలు చూస్తున్న దానకిశోర్‌.. హెచ్‌ఎండీఏను ప్రమోటర్‌గా చూపుతూ సిఫారసు చేసిన ఫైలుపైనే తాను సంతకం చేశానని వెల్లడించారు. దర్యాప్తును అడ్డుకోవడానికే తాను క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశానన్న ఏసీబీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నేరం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌ నిరూపించడం లేదు కాబట్టే.. దానిని కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏసీబీ కౌంటర్‌కు హైకోర్టులో కేటీఆర్‌ రిప్లై దాఖలు చేశారు. ప్రైవేటు స్పాన్సరర్‌కు సంబంధించిన భారాన్ని ప్రభుత్వం నెత్తిన రుద్దారన్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. స్పాన్సరర్‌ చేతులెత్తేయడంతో ఎఫ్‌ఈవో సంస్థ సీజన్‌ 10కు సంబంధించిన ఈవెంట్స్‌ క్యాలెండర్‌లో హైదరాబాద్‌ పేరును చేర్చలేదని తెలిపారు. హైదరాబాద్‌ పేరు ప్రఖ్యాతుల్ని కాపాడటానికి ఎఫ్‌ఈవో సంస్థతో చర్చలు జరిపి స్పాన్సరర్‌ మొత్తాన్ని మూడు వాయుదాల్లో చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘‘రెగ్యులేటరీ అనుమతులు లేకుండానే విదేశీ మారకంలో చెల్లింపులు చేశారని ఆరోపిస్తున్నారు. కానీ, ఎలాంటి అనుమతులు పొందాలో స్పష్టంగా చెప్పడం లేదు. ప్రొసీజర్‌ చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండదు. అదనపు ట్యాక్స్‌ భారం హెచ్‌ఎండీఏపై పడిందనే ఆరోపణ సైతం అర్థంలేనిది. ఎందుకుంటే అదనపు ట్యాక్స్‌లు ప్రమోటరే భరించాలని రెండు ఒప్పందాల్లోనూ ఉంది. అలాగే రూ.10 కోట్లకు మించిన ఖర్చులు చేస్తే హెచ్‌ఎండీఏ పరిపాలనాపరమైన అనుమతులు పొందాలని చెబుతున్నారే తప్ప.. అలాంటి ప్రొసీజర్‌ ఒకటి ఉందని, దానికి సంబంధించిన నిబంధనలు, చట్టం ఏంటో చెప్పడంలేదు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


ఒప్పందం కేవలం ఫార్మాలిటీయే..

ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారనడం సరికాదని, ఒప్పందం అనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమేనని కేటీఆర్‌ తెలిపారు. ఫార్ములా రేస్‌ సీజన్‌ 10ను హైదరాబాద్‌ చేజార్చుకోరాదనే ప్రధాన ఉద్దేశంతోనే చెల్లింపులు చేశామన్నారు. ‘‘ఎప్పుడెప్పుడు చెల్లింపులు చేయాలన్న దానికోసం మాత్రమే నామమాత్రంగా ఒప్పందం జరిగింది. ముందస్తు చెల్లింపులు చేయడం వల్లే సీజన్‌ 10లో హైదరాబాద్‌ పేరును చేర్చారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా చెల్లింపులు చేశారంటున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ నుంచి నోటీసు రాలేదు. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ 2023 అక్టోబరు 9న అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మంత్రిగా నా పాత్ర నామమాత్రమే. ప్రభుత్వం ఆరోపిస్తున్న దేనికీ నా బాధ్యత ఉండదు. వచ్చే మూడేళ్లకు 600 కోట్ల కమిట్‌మెంట్‌ ఇచ్చారన్నది వాస్తవం కాదు. అంకెలను ఎక్కువగా చేసి చూపుతున్నారు. పైగా హెచ్‌ఎండీఏ చేసే చెల్లింపులకు సెక్రటేరియట్‌ బిజినెస్‌ రూల్స్‌ వర్తించవు. ఫైల్‌ను రూపొందించిన దానకిశోర్‌ చెబుతున్న ప్రకారం ముఖ్యమంత్రికి ఫైల్‌ పంపించారు. విధానపరమైన అంశాలేవైనా ఉంటే సంబంధిత అధికారులే చూసుకోవాలి. ఒప్పందం చేసుకోవడంలో విధానపరమైన లోపాలున్నంత మాత్రాన ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించాలనే ఉద్దేశం, ఇతరులకు లబ్ధి కలిగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కాదు’’ అని కేటీఆర్‌ వివరించారు.


చెల్లింపులు చేయనందున భారీగా నష్టం..

తదుపరి 50ు చెల్లింపులు ఉద్దేశపూర్వకంగా చేయకపోవడం వల్ల రూ.55 కోట్ల నష్టం జరగడమే కాకుండా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోయిందని కేటీఆర్‌ తెలిపారు. 2023 ఫిబ్రవరిలో 9వ సీజన్‌ ఫార్ములా రేస్‌ నిర్వహించడం వల్ల రాష్ర్టానికి 83 మిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చినట్లు నీల్సన్‌ స్పోర్ట్స్‌ అనాలసి్‌సలో తేలిందన్నారు. ‘‘తర్వాత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 50ు మొత్తం ఎగ్గొట్టడం వల్లే అసలు నష్టం జరిగింది. తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి. నాపై తప్పుడు కేసు పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో ఒప్పందాన్ని గౌరవించకుండా డీఫాల్ట్‌ చేసింది. నా ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి, వేధించడానికే ఎలాంటి నేరం లేకున్నా దర్యాప్తు కొనసాగిస్తామంటున్నారు.ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో 14 నెలల ఆలస్యమవడమే కాక ప్రాథమిక దర్యాప్తు జరగలేదు. చట్టాన్ని అపహాస్యం చేస్తూ తప్పుడు ఆరోపణలతో పెట్టిన కేసును కొట్టేయండి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు

Updated Date - Dec 28 , 2024 | 04:22 AM