KTR : రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది
ABN , Publish Date - Oct 23 , 2024 | 05:25 AM
‘‘పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతిపాలన శాపంగా మారింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.
కాంగ్రెస్ నేతల ఆదాయం పెరుగుతోంది
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువునష్టం:కేటీఆర్
‘‘పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతిపాలన శాపంగా మారింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. ఆ పార్టీ నాయకుల ఆదాయం మాత్రం అమాంతం పెరుగుతోంది’’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తప్పులమీద తప్పులుచేసి తీరా.. తగ్గిన ఆదాయంపై అధ్యయనం కోసం ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం.. వారి అజ్ఞానానికి సజీవ సాక్ష్యమని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. పది నెలల పాలనలో అన్ని రంగాలను ఆగం చేశారని, కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలైందని విమర్శించారు. మరోవైపు.. తన వ్యక్తిత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని, మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించకున్నట్లు తెలిపారు. రాజకీయ విమర్శల పేరిట నీచమైన వ్యాఖ్యలు చేసేవారికి కొండా సురేఖపై వేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకగుణపాఠం కావాలని కేటీఆర్ హెచ్చరించారు.