Share News

Laknavaram Lake: లక్నవరానికి జలగండం!

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:12 AM

ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్న లక్నవరం చెరువుకు జలగండం పొంచి ఉంది. చుట్టూ కొండల నడుమ విశాలంగా పరుచుకున్న చెరువులోని దీవుల్లో విడిది చేయడం, పడవల్లో విహారం, ఉయ్యాల వంతెనలపై నడక పర్యాటకులకు ఇప్పుడైతే మధురానుభూతి కలిగిస్తోంది.

Laknavaram Lake: లక్నవరానికి జలగండం!

వేసవికి ముందే అడుగంటే ముప్పు.. అదే జరిగితే పర్యాటకానికి దెబ్బ

  • ఇటీవలే మూడో దీవి ముస్తాబు

  • రామప్ప నుంచి నీటి తరలింపునకు ఐదేళ్ల క్రితమే టెండర్లు

  • భూసేకరణ స్థాయిలోనే కెనాల్‌ పనులు

ములుగు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్న లక్నవరం చెరువుకు జలగండం పొంచి ఉంది. చుట్టూ కొండల నడుమ విశాలంగా పరుచుకున్న చెరువులోని దీవుల్లో విడిది చేయడం, పడవల్లో విహారం, ఉయ్యాల వంతెనలపై నడక పర్యాటకులకు ఇప్పుడైతే మధురానుభూతి కలిగిస్తోంది. అయితే వ్యవసాయ అవసరాలకు భారీగా నీటి వినియోగం జరుగుతుండగా క్రమంగా నీటిమట్టం తగ్గుతూ వేసవికి ముందే చెరువు అడుగంటే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే మొదట ప్రభావితమయ్యేది పర్యాటక రంగమే. మూడో దీవిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా ఇటీవలే రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అదే స్థాయిలో పర్యాటకులు తరలివస్తుండగా వారి ఆనందానికి కొద్ది నెలల్లోనే తాత్కాలిక బ్రేకులు పడే ప్రమాదం ఉంది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌గా ఉన్న రామప్ప చెరువు నుంచి లక్నవరానికి గోదావరి జలాలను తరలించే ప్రయత్నం భూసేకరణ స్థాయిలోనే మూలుగుతోంది.


ఐదేళ్ల క్రితం టెండర్లు పూర్తయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వర్షాకాలంలో మత్తడి దుంకుతూ జలసవ్వడి చేసే లక్నవరం చెరువు ఏటా వేసవిలో డెడ్‌ స్టోరేజీకి చేరుతోంది. 34 అడుగుల నిల్వ సామర్థ్యం కలిగిన చెరువు.. మైదానంలా మారుతోంది. దీంతో నాలుగు నెలలు పర్యాటక రంగం కుదేలవుతోంది. మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతంలో కురిసే భారీ వర్షాలు, వరద లక్నవరం చెరువుకు ఆధారం. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కనీస నీటిమట్టం చేరడం ఒక్కోసారి కష్టమతోంది. దీంతో ఆయకట్టులోని 12 వేల ఎకరాలకు సమృద్ధిగా నీరందక ప్రతిసారీ చివరి పొలాలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం లక్నవరానికి రామప్ప చెరువు నుంచి జలాలను తరలించాలని యోచించింది. 7.5 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వి గ్రావిటీతో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2019లోనే రూ.14.53 కోట్లు మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తయ్యాయి.


పర్యాటకంపై తీవ్ర ప్రభావం

లక్నవరం సరస్సుకు పొంచి ఉన్న నీటి సమస్య పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఆయకట్టులో యాసంగి తైబందీ ఖరారైంది. శ్రీరాంపతి, నర్సింహుల కాల్వల పరిధిలో 3,500 ఎకరాలకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నారుమడులు సిద్ధం కాగా మరో వారం రోజుల్లో నాట్లు పడనున్నాయి. దీంతో భారీగా నీటి వినియోగం జరుగుతోంది. జనవరి నుంచి క్రమంగా చెరువులో నీటిమట్టం తగ్గిపోనుండగా పైనుంచి వరద లేక కొద్దిరోజులకే అడుగంటే అవకాశముంది. ఇదే కనుక జరిగితే పర్యాటక బోట్లు ఒడ్డుకే పరిమితం కావాల్సి వస్తుంది. వాటర్‌ స్పోర్ట్స్‌, అడ్వెంచర్‌ గేమ్‌లు మూలనపడతాయి. ఫలితంగా పర్యాటకులు ఇక్కడకు వచ్చేందుకు వెనుకాడే ప్రమాదముంది.


తెగని భూసేకరణ పంచాయితీ

కాల్వ నిర్మాణానికి 145.36 ఎకరాల భూములు అవసరమవుతాయని సాగునీటి పారుదల అధికారులు గుర్తించారు. ఎకరానికి రూ.2.47 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. వరి, మిర్చి పంటలు సాగయ్యే ఈ భూములకు మంచి డిమాండ్‌ ఉండటంతో ఎకరం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల ధర పలుకుతోంది. రైతులు ఒప్పుకోకపోవడంతో పరిహారాన్ని ఎకరానికి రూ.8 లక్షలకు పెంచాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం లభించకపోవడంతో ఐదేండ్లు గడిచిపోయాయి. నిర్మాణ వ్యయం రెట్టింపైందని, పాత టెండర్‌ రేట్లకు అనుగుణంగా పనులు చేయలేమని కాంట్రాక్టర్‌ సైతం చేతులెత్తేశాడు. మంత్రి సీతక్క ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Dec 23 , 2024 | 05:12 AM