Share News

Hyderabad: ‘నాగాహిల్స్‌’పై సర్కారుకు నివేదిక!

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:16 AM

హైదరాబాద్‌ నడిబొడ్డున రాయదుర్గంలోని నాగాహిల్స్‌ సొసైటీని చెరబట్టి, అత్యంత విలువైన భూములను దౌర్జన్యంగా అధీనంలోకి తీసుకున్న బడా బాబుల బాగోతంపై ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: ‘నాగాహిల్స్‌’పై సర్కారుకు నివేదిక!

  • విలువైన సొసైటీ భూముల చెరపై సర్వత్రా చర్చ

  • స్థలంలో పనులు నిలిపివేసిన ఆక్రమణదారులు

  • ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపిన ప్లాట్ల యజమానులు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ నడిబొడ్డున రాయదుర్గంలోని నాగాహిల్స్‌ సొసైటీని చెరబట్టి, అత్యంత విలువైన భూములను దౌర్జన్యంగా అధీనంలోకి తీసుకున్న బడా బాబుల బాగోతంపై ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర కలకలం రేపింది. ప్లాట్ల యజమానులు మూడు దశాబ్దాలకు పైగా న్యాయపోరాటం చేసి గెలిచి, చివరకు ఇళ్లు కట్టుకునే సమయంలో గద్దల్లా వాలిన భూ మాఫియా దౌర్జన్యంపై ‘నాగాహిల్స్‌లో కబ్జానాగులు’ శీర్షికతో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూముల్లో బడా వ్యక్తులు పాగా వేసి, ప్లాట్ల యజమానులను వారి స్థలాల్లోకి రాకుండా బౌన్సర్లతో అడ్డుకుంటున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


సుప్రీంకోర్టులో కేసు గెలిచిన ప్లాట్ల యజమానులను భూ మాఫియా అడుగడుగునా బెదిరిస్తూ సదరు భూమిని తమకు తక్కువ నిష్పత్తిలో ‘అభివృద్ధి’కి ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. బెదిరింపులకు పాల్పడుతున్న వారికి అధికార వ్యవస్థలు దాసోహం కావడాన్ని ఆధారాలతో సహా ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు అక్కడ అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్న ఆక్రమణదారులు తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. ఈ కథనం ప్రచురితమవడంతో ఇప్పటి వరకు ప్లాట్ల విషయంలో ఏం జరుగుతుందో తెలియని విదేశాల్లో ఉన్న కొందరు ప్లాట్ల యజమానులు సహచరులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. కొందరు ప్లాట్ల యజమానులు శనివారం రాత్రి రాయదుర్గంలో సమావేశమై, భూ మాఫియాపై పోరాడాలని నిర్ణయించారు. తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 24 , 2024 | 03:16 AM